టిఆర్‌ఎస్ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంపైన ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమమని పేర్కొన్నారు. పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో స్ఫురింపజేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తనకు మనసు ఉప్పొంగిందని పేర్కొంటూ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం పచ్చదనాన్ని పెంచడమేగాక, పరిశుభ్రత అవసరాన్ని అందరికీ తెలియజేస్తున్నదని, ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి కొనసాగిస్తున్న ఎంపీకి ప్రత్యేక శుభాకాంక్షలని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు.
భూమాతను, ప్రకృతిని పూజించటం అనేది ఆది నుంచి మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని, ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కృషి చేస్తున్నదని ప్రధాని ప్రశంసించారు. మనమందరమూ భూమాత పిల్లలమేనని, ప్రకృతితో సహజీవనం, సమన్వయం మన జీవనమార్గం కావాలని ప్రధాని ఆకాంక్షించారు.
ప్రకృతిపరంగా మన గొప్ప వారసత్వాన్ని కాపాడుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని తన లేఖలో గుర్తుచేశారు. సౌరశక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం, కర్భన ఉద్ఘారాలను తగ్గించేందుకు కృషి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం లాంటి చర్యలన్నీ పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును ఇస్తాయన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశిష్టతను తెలుపుతూ ఎంపి సంతోష్ కుమార్ వెలువరించిన వృక్షవేదం పుస్తకం గురించి తన లేఖలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత వృక్షవేదం పుస్తకాన్ని చదివి, ప్రకృతి ప్రాధాన్యతను తెలుసుకోవాలని సూచించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనడం ద్వారా పచ్చదనాన్ని దేశవ్యాప్తంగా పెంచాలని ప్రధాని కోరారు. ఈ కార్యక్రమం మరింత వేగాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తాను తనవంతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అభినందించడంపై ఎంపి సంతోష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
లేఖ ద్వారా తనను ప్రత్యేకంగా అభినందించిన ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన ప్రోత్సాహంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని తాను మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
More Stories
ఫిరాయింపులపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
ఎస్డిఎఫ్ నిధులతోపాటు ఖమ్మంకు అదనంగా సాయం
నివాసముంటున్న ఇళ్లు కూల్చం