అసాధారణ పరిస్థితుల్లోనే అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్‌ను మంజూరుచేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఓ కేసులో తీర్పు ఇచ్చింది.
ముందస్తు బెయిల్‌కు సంబంధించి సీఆర్‌పీసీ సెక్షన్ 438ని హైకోర్టు లేదా సెషన్స్ కోర్టులు సరళంగా అన్వయించుకోవాలని పేర్కొంది. సరైన కారణాలు లేకుండానే కోర్టులు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. నిందితులను 90 రోజులపాటు అరెస్టు నుంచి రక్షించడాన్ని ధర్మాసనం గుర్తించింది.
వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా ముందస్తు బెయిల్‌కు నిర్ణీత కాలాన్ని హైకోర్టు లేదా సెషన్స్ కోర్టు నిర్ణయించవచ్చునని, కానీ అందుకు తగిన కారణం ఉండాలని తెలిపింది.
తీర్పు వెలువరిస్తూ… ‘‘ఒకవైపు దర్యాప్తు సంస్థలు, ఫిర్యాదుదారులు, సమాజం వ్యక్తం చేసే ఆందోళనలు, మరోవైపు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసే వ్యక్తి ఆందోళన మధ్య కోర్టులు సమతౌల్యం పాటించాలి. దర్యాప్తు సంస్థల ఆందోళనను పరిగణనలోకి తీసుకొంటూనే, పిటిషనర్ ప్రయోజనాలు రక్షించేలా ఉత్తర్వులు ఉండాలి. ఆ ఉత్తర్వులు కూడా సహేతుకంగా ఉండాలి’’ అని బెంచ్ స్పష్టం చేసింది.
తీర్పు నేపథ్యంలోకి వెళ్తే యూపీకి చెందిన రెండు వేర్వేరు కేసుల్లో నిందితులకు 90 రోజులు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చి న ఉత్తర్వులను ఫిర్యాదుదారులు సుప్రీంలో సవాలు చేశారు. ఆ కేసును విచారించిన జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టింది. నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకొని నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
సీఆర్‌పీసీ సెక్షన్ 438(1) ప్రకారం దర్యాప్తు సంస్థ, ఫిర్యాదుదారులు వ్యక్తం చేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకోకుండా, సహేతుక కారణాలు లేకుండా హైకోర్టు నిందితులకు అరెస్టు నుంచి రక్షణ కల్పించిందని ధర్మాసనం పేర్కొంది. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపించి, దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది.
More Stories
శ్రీనగర్ మార్కెట్లో గ్రెనేడ్ పేలుడు.. 12 మందికి గాయాలు
పూరి ఆలయంలో రహస్య సొరంగం లేదు
శ్రీనగర్ ఎన్ కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!