రెండోదశ కరోనా తీవ్రత రోజురోజుకూ తగ్గుముఖం

రెండోదశ కరోనా తీవ్రత రోజురోజుకూ తగ్గుముఖం

సెగలు రేపిన రెండోదశ కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. గత 20 రోజులుగా కరోనా కేసులు స్థిరంగా తగ్గుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ  తెలిపింది. ఇది కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుదులకు తార్కాణంగా అభివర్ణించింది. 

‘రెండో దశ కొవిడ్ ఉధృతితో పాటు కేసుల సంఖ్య క్రమంగా 20 రోజులుగా తగ్గూతూనే వస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగుతుందని నమ్ముతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంక్షలు గణనీయంగా సరళతరం చేసినా వైరస్ తగ్గుముఖ పరిణామం ఇప్పటిలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం’ అని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ దేశంలో కొవిడ్ కేసులు సంబంధిత పరిస్థితి అధికారిక బులెటిన్ వెలువరించింది.

24 రాష్ట్రాల్లోని కేసులను పరిశీలిస్తే వారం రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయని ఆ ప్రకటనలో తెలిపారు. దీని మేరకు క్రమేపీ సెకండ్‌వేవ్ తగ్గుతూ వస్తున్నట్లు, జూన్‌లో ఎప్పటికైనా ఇది దాదాపుగా సమసిపోవడానికి వీలున్నట్లు ఆ ప్రకటలో తెలిపింది. రోజువారి కేసులు తగ్గుముఖం పట్టాయి.

ఇక గత వారం నుంచి క్రియాశీల కేసులలో తగ్గుదల కన్పిస్తోందని, ఇది కీలక పరిణామం అని తెలిపారు. సెకండ్ వేవ్ క్షీణించడం అనేది కొవిడ్ పదఘట్టానికి సంబంధించి ప్రధానమైన మైలురాయి అవుతుంది. ఈ నెల ఆరంభం అంతకు ముందటి వరకూ దేశంలో కరోనా కేసుల రోజువారి సంఖ్య విపరీతమైన ఆందోళనకు దారితీసింది.

ఎటునుంచి ఎటువెళ్లుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓ వైపు వ్యాక్సిన్ల కొరత మరో వైపు రోజువారి కేసులు,మరణాల సంఖ్యలో ఎదుగుదలతో ఇక దేశానికి థర్డ్‌వేవ్ కరోనా తప్పదనే భయాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు 20 రోజులుగా పరిస్థితిలో మార్పు వస్తోందని ఇది ఇదే విధంగా కొనసాగితే సెకండ్ వేవ్ ముప్పు సమసిపోతుందని, ఈ పరిణామం ఏర్పడుతుందని ఆశిస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వశాఖ తొలిసారిగా విశ్వాసం వ్యక్తం చేసింది.

మ‌రోవైపు క‌రోనా నుంచి పెద్ద సంఖ్య‌లో రోగులు కోలుకుంటుండ‌టంతో రిక‌వ‌రీ రేటు 85.6 శాతం నుంచి 90.34 శాతానికి పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోజువారీ కేసులను మించి రికవరీలు పెరుగుతున్నాయ‌ని రిక‌వరీ రేటు 90 శాతానికి పెరగ‌డం సానుకూల ప‌రిణామ‌మ‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ వెల్ల‌డించారు. గత వారం రోజులుగా 24 రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల్లో త‌గ్గుద‌ల న‌మోదైంద‌ని చెప్పారు.

ఇటీవల రెండు లక్షలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా రెండు లక్షలకు దిగువన చేరాయి. 44 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి రోజువారీ కేసులు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,86,364 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 2,59,459 మంది బాధితులు కోలుకున్నారు. మరో 3,660 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు వదిలారు.

ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10.42శాతంగా ఉందని, రోజు వారీ పాజిటివిటీ రేటు 9శాతానికి చేరుకుందని పేర్కొంది. వరుసగా నాలుగు రోజుల్లో పాజిటివిటీ రేటు పది శాతానికన్నా తక్కువగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 20.57 కోట్ల వ్యాక్సిన్‌ మోతాదులను అందజేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.