గోప్యత హక్కు సమంజస పరిమితులకు లోబడే!

గోప్యత హక్కు సమంజస పరిమితులకు లోబడే!

కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్‌ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు లో దావా వేసిన  వాట్సాప్‌నకు కేంద్ర ప్రభుత్వం దీటుగా సమాధానం చెప్పింది.  వ్యక్తుల గోప్యతను ఉల్లంఘించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.  అయితే ఈ హక్కు సమంజసమైన పరిమితులకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. 

ఏ ప్రాథమిక హక్కు అయినా సంపూర్ణమైనది, మార్పులకు గురి కానిది కాదని తేల్చి చెప్పారు. వాట్సాప్ తన యూజర్ల డేటాను మార్కెటింగ్, అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం తన పేరెంట్ కంపెనీ అయిన ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోవడానికి ప్రైవసీ పాలసీని రూపొందిస్తోందని, అదే సమలో బూటకపు వార్తలను కట్టడి చేయడానికి, శాంతిభద్రయంతలను కాపాడటానికి అవసరమైన మార్గదర్శకాలను ఆమోదించడానికి తిరస్కరిస్తోందని చెప్పారు.

భారత దేశంలోని ప్రజలందరి వ్యక్తిగత గోప్యత హక్కును పరిభారక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన  చెప్పారు. అదే సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, దేశ భద్రతను కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యతలేనని కేంద్రమంత్రి గుర్తు చేశారు.

స్థిరపడిన న్యాయ సిద్ధాంతాలన్నిటినీ పరిశీలించినప్పటికీ, ఏ ప్రాథమిక హక్కు అయినా, వ్యక్తిగత గోప్యత హక్కు సహా, పరిపూర్ణమైనది, మార్పులకు గురి కానిది కాదని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు సమంజసమైన పరిమితులకు లోబడి అమలవుతాయని తెలిపారు. సమాచారాన్ని మొదట పంపినవారి వివరాలను అడగటం ఇటువంటి సమంజసమైన పరిమితులకు ఉదాహరణ అని స్పష్టం చేశారు. 

ఓ సందేశాన్ని మొదటిసారి ఎవరు పంపించారు? ఎక్కడి నుంచి వచ్చింది? వంటి వివరాలను తెలియజేయాలని వాట్సాప్‌ను కోరామంటే, చాలా తీవ్రమైన నేరాల నిరోధం, దర్యాప్తు, శిక్ష విధించడం కోసమేనని తెలిపారు. 

భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను కాపాడటానికి సంబంధించిన నేరాలు, దేశ భద్రత, మిత్ర దేశాలతో స్నేహ సంబంధాలు, శాంతిభద్రతలు, వీటన్నిటికీ సంబంధించిన నేరాలను ప్రోత్సహించడం వంటి నేరాలను నిరోధించడం, శిక్షించడం కోసం మాత్రమే మెసేజ్ మూల స్థానం గురించి తెలియజేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. 

అదే విధంగా అత్యాచారాలు, లైంగిక దోపిడీకి సంబంధించిన మెటీరియల్, బాలలపై లైంగిక నేరాలకు సంబంధించిన మెటీరియల్ వంటివాటిని నిరోధించేందుకు, నేరగాళ్ళను శిక్షించేందుకు ఈ సమాచారాన్ని అడుగుతున్నట్లు తెలిపారు. 

కాగా, తాము వెలువరించిన డిజిటల్ రూల్స్‌ను ఆమోదిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికలు వెంటనే తమకు సమ్మతి రిపోర్టు అందించాలని కేంద్ర సమాచార సాంకేతిక వ్యవహారాల (ఐటి) మంత్రిత్వశాఖ తాజాగా ఆదేశాలు వెలువరించింది. చీఫ్ కంప్లెయిన్స్ ఆఫీసర్‌ను, నోడల్ కాంటాక్ట్ పర్సన్‌ను, స్థానిక సమస్యల పరిష్కార అధికారిని ఏర్పాటు చేయాలని ఇతరత్రా చర్యలు చేపట్టాలని, వివాదాస్పద అంశాల నియంత్రణ బాధ్యతకు సంస్థలు బాధ్యతలు తీసుకుని తీరాలని స్పష్టం చేశారు.