
ప్రధాని నరేంద్రమోదీ రేపు తుఫాన్ ప్రభావిత ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించనున్నారు. రేపు ఢిల్లీలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న ప్రధాని ముందుగా భువనేశ్వర్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఉన్నతాధికారులతో సమావేశమై ఒడిశాలో తుఫాన్ పరిస్థితిపై సమీక్షించనున్నారు.
అనంతరం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన బాలాసోర్, భద్రక్, పర్బ మేదినిపూర్‌లలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌కు వెళ్లనున్నారు. అక్కడ కూడా తుఫాన్ పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు.
కాగా, యాస్ తుపాను సృష్టించిన విలయం ప్రభావం కోటి మందిపై పడిందని, పెద్ద ఎత్తున ఇళ్లు దెబ్బతిన్నాయని, పంటనష్ట జరిగిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. కనీసం మూడు లక్ష ఇళ్లు, 134 కరకట్టలు దెబ్బతిన్నాయని చెప్పారు.
ఒడిశాలో యాస్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నది. బుధవారం మధ్యాహ్నం తుఫాన్ తీరాన్ని తాకినప్పటి నుంచి అక్కడ కుండపోత వర్షం కురుస్తున్నది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దాంతో ఇండ్లు నీట మునిగి కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెస్క్యూ బృందాలు బాధితులు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
పలుచోట్ల సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలిక్యాప్టర్లో తిరుగుతూ రాష్ట్రంలో వరద పరిస్థితిని పరీక్షించారు.
రాబోయే 24 గంటల్లో అన్ని ప్రధాన రోడ్లు, 80 శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు. అనంతరం తుఫాన్ వల్ల అధిక ప్రాణ నష్టం జరుగకుండా చూసుకోవాలని అధికారులను అదేశించారు. సహాయక శిబిరాల్లో బాధితులకు భోజనంతోపాటు వైద్య సదుపాయాలను కూడా సమకూర్చాలని ఆదేశాలు జారీ చేశారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు