గురుకుల విద్యార్థుల విషయంలో రంగారెడ్డి కలెక్టరుకు సమన్లు

హైదరాబాద్: తెలంగాణ గురుకుల పాఠశాలల విద్యార్థుల అంశంలో అసంపూర్తి నివేదిక ఇచ్చినందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరుకు జాతీయ బాలలహక్కుల పరిరక్షణ కమిషన్ సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. కరోనా రెండో ఉధృతి నేపథ్యంలో మార్చి 24 నుండి తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో విద్యాసంస్థలన్నీ మూతబడ్డాయి. అయితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ వద్దనున్న ఆజాద్ ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రం మూడు వందలకు పైగా విద్యార్థినులకు మాత్రం వసతి సదుపాయం కల్పించి  ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విషయాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళింది.
ఇదే సమయంలో  హైదరాబాద్ చేరుకున్న కమిషన్ సభ్యులు ఆర్.జి. ఆనంద్ ఏప్రిల్ 3వ తేదీన స్వయంగా కళాశాలకు వెళ్లి పరిశీలించి విచారించగా, వారంతా తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులుగా తేలింది. ఈ అంశంపై విచారణ జరిపి, తీసుకున్న చర్యల తాలూకు నివేదిక సమర్పించాల్సిందిగా కమిషన్ రంగారెడ్డి జిల్లా కలెక్టరును ఆదేశించింది.
అయితే కలెక్టర్ సమర్పించిన అసంపూర్తి  నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషన్, జాతీయ బాలల హక్కుల సంరక్షణ చట్టం 2005లోని సెక్షన్ 14 ప్రకారం కలెక్టరుకు సమన్లు జారీ చేసింది. ఈనెల 28న పూర్తి స్థాయి నివేదికతో పాటు సంబంధిత వ్యక్తులపై నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ కాపీ తీసుకుని తమ ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా కలెక్టరుకు జారీ చేసిన సమన్లలో కమిషన్ ఆదేశించింది. ఒకవేళ హాజరుకాని పక్షంలో సివిల్  ప్రొసీజర్ కోడ్ 1908లోని సెక్షన్ 10, 11 కింద తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది.
కలెక్టర్ నివేదికలో ఏముంది?
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి గురుకుల పాఠశాలల విద్యార్థినులకు హాస్టల్ వసతి, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటంపై చర్యలు తీసుకుని, తమకు నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ రంగారెడ్డి జిల్లా కలెక్టరును ఏప్రిల్ 7వ తేదీన ఆదేశించింది. అయితే దీనిపై కలెక్టర్ ఇచ్చిన నివేదికలో విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
బాలికలకు హాస్టల్ వసతి కల్పించిన ఆజాద్ ఇంజనీరింగ్ కళాశాల 2014 సంవత్సరం నుండి అడ్మిషన్లు లేని కారణంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖకు లీజుకి ఇవ్వబడింది. ఆ కళాశాలలో సాంఘిక సంక్షేమ శాఖ 6 నుండి 10 వ తరగతి విద్యార్థులకు పాఠశాల నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం లాక్-డౌన్ ప్రకటించిన వెంటనే అనగా మార్చి 24వ తేదీన విద్యార్థులందరూ తమతమ ప్రాంతాలకు వెళ్లిపోయారని, మరుసటి రోజు, అనగా మార్చి 25వ తేదీన కొంతమంది కొత్త విద్యార్థులు అక్కడికి చేరుకున్నారని, వారి వివరాలు ఎవరికీ తెలియవు అని, వారు కొన్ని రోజులకు అక్కడి నుండి వెళ్లిపోయారని నివేదికలో జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
చర్యలు చేపట్టని పోలీసులు!
ఈ అంశంపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాల్సిందిగా  జాతీయ బాలల హక్కుల కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కి కూడా  సూచన చేసినప్పటికీ ఫలితం లేదు. స్థానిక ఏబీవీపీ, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కార్యకర్తలు ఏప్రిల్ 3వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటిదాకా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. అయితే ఈ విషయంలో కచ్చితంగా ఎఫ్.ఐ. ఆర్ నమోదు చేసి, ఆ కాపీ తమకు సమర్పించాలని కమిషన్ తాజాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరును ఆదేశించడంతో ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి.