ముద్ర రుణాలపై బ్యాంకర్లు కేంద్రీక‌రించాలి

క‌రోనా రెండో వేవ్‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న పాక్షిక లాక్‌డౌన్‌ల నేప‌థ్యంలో రుణ ప‌రప‌తి డిమాండ్ పురోభివ్రుద్ధి కోసం అర్హులైన వారికి ముద్ర రుణాలు మంజూరు చేయ‌డంపై కేంద్రీక‌రించాల‌ని బ్యాంక‌ర్ల‌ను కేంద్రం కోరింది.

ప్ర‌ధాన‌మంత్రి ముద్ర యోజ‌నా (పీఎంఎంవై) కింద చిన్న వ్యాపారాలు, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు మంజూరు చేసే రుణాలే ముద్ర రుణాలు. గ‌త నెల నాటికి ముద్ర రుణాల కింద రూ.14.96 ల‌క్ష‌ల కోట్ల రుణాలు మంజూరు చేశాయి బ్యాంకులు. గ‌త ఆరేండ్ల‌లో 28.68 కోట్ల మందికి ల‌బ్ది చేకూరింది.

స‌గ‌టున బ్యాంకులు రూ.52 వేల రుణాలు మంజూరు చేశాయి. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.2.79 ల‌క్ష‌ల కోట్ల రుణాలు మంజూరు చేయ‌గా, రూ.2.64 ల‌క్ష‌ల కోట్లు పంపిణీ చేశాయి బ్యాంకులు. ఇక శిషు క్యాట‌గిరీలో కోల్లెట‌ర‌ల్ ఫ్రీ రుణాల‌ను ల‌బ్ధి దారుల‌కు రూ.50 వేల వ‌ర‌కు ఇవ్వొచ్చు.

2015లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ.. నాన్ కార్పొరేట్‌, నాన్ ఫార్మ్‌, చిన్న‌, సూక్ష్మ ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపారుల‌కు రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ను మంజూరు చేయ‌డానికి పీఎంఎంవై ప‌థ‌కాన్ని ప్రారంభించారు.