బెంగాల్ మంత్రుల `హౌస్ అరెస్ట్’ సుప్రీం లో సవాల్ 

నారదా కుంభకోణం కేసులో ముగ్గురు తృణమూల్‌, ఒక మాజీ నేతలను హౌస్‌ అరెస్టు చేయాలంటూ కోల్‌కతా హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సోమవారం సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నారదా స్ట్రింగ్‌ ఆపరేషన్‌ కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఫర్హాద్‌ హకీమ్‌, సుబ్రతా చటర్జీ ఇద్దరు మంత్రులుగా ఉండగా..ఒకరు ఎమ్మెల్యే మదన్‌, మరొకరు మాజీ మంత్రి సోవన్‌ చటర్జీ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వీరిని సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఈ నలుగురు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేపట్టకుండా ఆదేశించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ కోరింది. కాగా, ప్రస్తుతం దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతుండగా, బెయిల్‌ పిటిషన్‌పై 11 గంటలకు హైకోర్టు విచారించనుంది. శుక్రవారం విచారణ చేపట్టిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం వీరికి మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తూ రెండు అభిప్రాయాలను వెల్లడించింది. ఒక జడ్జి బెయిల్‌కు అనుమతినివ్వగా, మరో జడ్జి హోం అరెస్టు చేయాలంటూ ఆదేశించారు. దీన్ని వ్యతిరేకిస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కాగా, నారదా స్ట్రింగ్‌ కేసు విచారణను వాయిదా వేయాలంటూ సిబిఐ చేసిన విజ్ఞప్తిని కోల్‌కతా హైకోర్టు తిరస్కరించింది. ఈ నెల 19, 21 తేదీల్లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సిబిఐ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసినందున దీని విచారణ వాయిదా వేయాలంటూ సిబిఐ తరుఫున సొలిసీటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు. 

 
వర్చువల్‌గా విచారణ చేపట్టిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఎదుటకు పిటిషన్‌ను జాబితా చేయని నేపథ్యంలో ఈ కేసు విచారణ ప్రారంభించాలని కోర్టు నిర్ణయించింది. ఈ కేసు దిగువ కోర్టు నుండి హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్‌ను పరిశీలించింది. అదేవిధంగా కింద కోర్టు ఇచ్చిన తీర్పును స్టే ఆర్డర్‌ను రీకాల్‌ చేయాలన్న అభ్యర్థనను పరిశీలించింది.