సభాహక్కుల కమిటీకి  రఘురామ అరెస్ట్

ఎంపీ రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. రఘురామ కుటుంబీకుల ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి స్పీకర్‌ పంపారు. రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని హోంశాఖను కోరారు. ఫిర్యాదు కాపీని హోంశాఖకు లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం పంపింది. 
 
అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్‌ వేశారన్న కక్షతోనే రాజద్రోహం కేసు పెట్టారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. 
 
తమకు ప్రాణభయం ఉందని.. జోక్యం చేసుకుని న్యాయం చేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు. రఘురామ సతీమణి రమాదేవి, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, తనయుడు భరత్‌తో కలిసి గురువారం ఓం బిర్లా, రాజ్‌నాథ్‌లతో వారు  సమావేశమయ్యారు.
రఘురామరాజుపై జగన్‌ ప్రభుత్వం సీఐడీ ద్వారా అక్రమంగా పెట్టిన కేసులు, అరెస్టు తీరు, భౌతిక దాడులు, కోర్టు ఆదేశాల ధిక్కరణలను కూలంకషంగా వివరించినట్లు తెలుస్తున్నది. తొలుత వారు స్పీకర్‌ను కలిశారు. సీఐడీ కస్టడీలో ఉండగానే.. రఘురామపై కొందరు  ఏవిధంగా భౌతికంగా దాడులకు తెగబడ్డారో వివరించారు.