రాజస్థాన్ కాంగ్రెస్ లో మరోసారి కుమ్ములాటలు 

రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, ఆయన ప్రత్యర్థి, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. దానితో  రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్ర మహమ్మారి మధ్యలో మరోసారి బయటపడుతున్నట్లు కనిపిస్తోంది.
సచిన్ పైలట్ శిబిరానికి చెందిన ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాజీనామా చేయగా, మరో శాసనసభ్యుడు వైదొలగుతానని బెదిరించారు. ప్రముఖ నాయకుడు, ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన హేమరం చౌదరి తన రాజీనామాను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సి.పి. జోషి లకు మంగళవారం పంపారు.
ఈ 73 ఏళ్ల నాయకుడు పైలట్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రితో పాటు గత ఏడాది గెహ్లాట్‌పై ఇదివరలో తిరుగుబాటు చేసిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఒకరు.
గెహ్లాట్ ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న చౌదరి, రాష్ట్ర రాజకీయాల్లో తనను ప్రాధాన్యత లేకుండా పక్కన పడేయడం పట్ల కలత చెందుతున్నట్లు తెలుస్తున్నది.  గెహ్లాట్ ప్రభుత్వంలో మంత్రిగా చేయకపోవడంపై చౌదరి నిరాశ చెందారని భావిస్తున్నారు. 

చౌదరి రాజీనామా తరువాత, మరిన్ని అసంతృప్తి స్వరాలు ఇప్పుడు బిగ్గరగా వస్తున్నాయి. తన కార్యకర్తల మనోవేదనలను వినకపోతే, తన నియోజకవర్గంలో పనుల కోసం డిమాండ్లు తీర్చకపోతే రాజీనామా చేస్తామని చక్సుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ సోలంకి బెదిరించారు.

ప్రచారంలో ఉన్న ఆయన ఒక ప్రధాన ఫిర్యాదు ఏమిటంటే, రాష్ట్రంలోని బ్యూరోక్రసీ పాలనా వ్యవహారాలలో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఎమ్మెల్యేలు లేదా వారి మద్దతుదారులు తమ సమస్యలను ప్రభుత్వానికి అందజేయలేకపోతున్నారు. తమ ప్రాంతాలకు చెందిన పనులు చేయించుకోలేక పోతున్నారు. 

చౌదరి తన రాజీనామా నిర్ణయానికి గల కారణాలను వివరించడానికి ఇప్పటివరకు నిరాకరించినప్పటికీ, సోలంకి మాత్రం స్పష్టం చేశారు.  “ప్రభుత్వ వ్యవహారాలలో బ్యూరోక్రసీ ఖచ్చితంగా ఆధిపత్యం చెలాయిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మా నియోజకవర్గాలకు సంబంధించిన పనులను పొందడం లేదా మా కార్యకర్తల  మనోవేదనలను పరిష్కరించడం మాకు కష్టంగా ఉంది” అని పేర్కొన్నారు.

పైలట్, గెహ్లాట్ ల మధ్య సయోధ్య కుదిర్చిన్నట్లు చెబుతున్నప్పటికీ తమకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని, అవి పక్కదారి పడుతున్నాయని పైలట్ శిబిరంలో అసంతృప్తి పెరుగుతున్నది. తమ  మనోవేదనలను పరిష్కరించలేదని, పవర్ డైనమిక్స్‌లో వారికి తగినంత పునరావాసం లభించలేదని రగిలిపోతున్నారు.