గుజరాత్‌ దిశగా కదులుతున్న ‘తౌక్టే’ తుపాను

‘తౌక్టే’ తుపాను గుజరాత్‌ దిశగా కదులుతోంది. తుపాను ఈ నెల 18న గుజరాత్‌ వద్ద తీరం దాటనుంది. పోర్‌బందర్‌-మహువా తీరం మధ్య ఈ 18న వేకువజామున తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. . ప్రస్తుతం పంజిమ్‌-గోవాకు నైరుతి దిశలో 170 కిలోమీటర్ల దూరం, ముంబై 520 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది.
తీరం దాటే సమయంలో 175 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని, ఆ ప్రాంతంలో అతిభారీ వర్షం కురుస్తుందని తెలిపింది. అయితే, ముంబయిలాంటి నగరాలకు భారీ నష్టాలేమీ జరిగే అవకాశం లేదని పేర్కొన్నది. ఈ నెల 17న ముంబయిలో భారీ గాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది.
 
తుపాన్‌ ప్రభావంతో కేరళ, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత రాష్ట్రాల్లో 53 ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు మోహరించాయి. గుజరాత్‌లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురియనున్నట్టు తెలిపింది. జునాగఢ్, గిర్‌సోమనాథ్ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు, సౌరాష్ట్ర, కచ్, దివు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
కోస్తా ప్రాంతాలైన మోర్బీ, కచ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్ జిల్లాల్లో రెండుమూడు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసి పడ్తాయని తెలిపింది. పోర్‌బందర్, జునాగఢ్, దివు, గిర్ సోమనాథ్, అమ్రేలీ, భావనగర్ ప్రాంతాల్లోనూ రెండు మీటర్ల వరకు అలలు ఎగసి పడ్తాయని తెలిపింది.
తౌక్టే తుఫాను కర్ణాటకలో బీభత్సం సృష్టిస్తోంది. తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్‌లో భారీ వర్షపాతం నమోదైందని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్‌డీఎంఏ) ఆదివారం తెలిపింది. తుఫానుకు 73 గ్రామాలు ప్రభావితమయ్యాయని, ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు.  తీర ప్రాంతాల్లో తుఫాను పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని సీఎం బీఎస్‌ యెడ్యూరప్ప పేర్కొన్నారు.

 ‘తౌక్టే’ తుపానుపై ప్రధాని మోదీ సమీక్షించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుపాన్ ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర అధికార యం త్రాంగం సన్నద్ధతపై ప్రధాని మోడీ శనివారం ఉన్నతస్థా యి సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధితశాఖల అధికారులు, సహాయక చర్యల్లో పాల్గొనే ఏజెన్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తుపాన్ తాకిడి ఉండే ప్రాంతా ల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రధాని ఈ సందర్భంగా ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. నిత్యావసర సేవలైన విద్యుత్ సరఫరా, టెలీకమ్యూనికేషన్స్, ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు.

ఎక్కడైనా నష్టం వాటిల్లితే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కంట్రోల్ రూంలు 24 గంటలు పని చేయాలని ప్రధాని ఆదేశించారు. కొవిడ్ ఆస్పత్రులు, వ్యాక్సిన్ల కోల్డ్ స్టోరేజ్ చైన్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. జామ్‌నగర్ నుంచి ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ప్రధాని ప్రత్యేకంగా గుర్తుచేశారు.

తుఫాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు 100 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు, ఈ బృందాలను తీరప్రాంత రాష్ట్రాలైన కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, గోవా, మహారాష్ట్రలకు పంపనున్నట్టు ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్‌ఎన్ ప్రధాన్ తెలిపారు.