ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా, పంపిణి పెద్ద సవాల్ 

ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా, పంపిణీ ఒక ఛాలెంజ్ గా మారిందని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం బీబీనగర్ ఎయిమ్స్ ను సందర్శించిన ఆయన డిమాండ్ పెరగడంతో 24 గంటలు నిరంతరాయంగా ( 24/7) వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు.
ప్రజలు ఇబ్బందిపడకుండా అవసరాన్ని గుర్తించి విదేశాల నుంచి యుద్ధవిమానాల తో ఆక్సిజన్ తెస్తున్నామని, జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింపులు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా,  కేంద్రం నుంచి అందిన ఆక్సిజన్ పంపిణి బాధ్యత కూడా రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ పై రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
 
ప్రపంచ దేశాల సహకారం తీసుకుంటూ సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ , వ్యాక్సిన్ , మెడికల్ పరికరాలను సమకూర్చుకోవడంలో అన్ని దేశాలనుంచి సహకారం తీసుకుంటూనే దేశంలో ఉత్పత్తులను వేగవంతం చేశామని పేర్కొన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. భారత్ బయో టెక్ వ్యాక్సిన్ ని ఇతర కంపెనీలలో భారత్ బయో టెక్ బ్రాండింగ్ తోనే ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
 
  కోవిడ్ మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో కర్ఫ్యూ లక్డౌన్ కంటెయిన్ మెంట్ జోన్ ల విధింపు పై రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిస్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా స్పందించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చని ఆయన తెలిపారు.  
 
గాలి ద్వారా కూడా ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్లను పెడుతున్నామని, హైదరాబాద్ లో  గాంధీ హాస్పిటల్ , టీమ్స్, కింగ్ కోఠి , సనత్ నగర్ హాస్పిటల్స్ కు మంజూరు చేశామని త్వరలోనే బీబీనగర్ ఎయిమ్స్ కి  కేటాయిస్తామని వివరించారు. 
 
పారామెడికల్ , నర్సింగ్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయని, 50 ఆక్సిజన్ సిలెండర్లు బీబీనగర్ కు ఇచ్చామని, కాన్సన్ట్రేటర్స్ త్వరలోనే వస్తాయని, కోవిడ్ 50 బెడ్లు ఉన్నాయని త్వరలోనే 200 బెడ్స్ కి పెంచుతామని చెప్పారు. అన్ని హాస్పిటల్స్ ని పూర్తిస్థాయిలో కోవిడ్ హాస్పిటల్స్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, పీఎం కేర్స్ ద్వారా టిమ్స్, గాంధీ హాస్పిటల్స్ కి  400 వెంటిలేటర్లను అందించామని కిషన్ రెడ్డి వివరించారు 
 
బీబీనగర్ ఎయిమ్స్ ట్రాన్స్ ఫర్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, పూర్తి స్థాయిలో అధికారిక ప్రక్రియ జరగాల్సి ఉందని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన పేపర్స్ ఎక్కడున్నాయో ఎవరికి తెలియడం లేదన్నారు. స్థానిక సమస్యలతో బీబీనగర్ ఎయిమ్స్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.