తెలంగాణాలో  పీఎంజీఎస్వై పనులు ఎమ్యెల్యేలు చెప్పినోళ్లకే! 

గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశను తీసుకొచ్చే ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చేపడుతోంది. ఇ – ప్రొక్యూర్ మెంట్ విధానానికి తూట్లు పొడుస్తూ తమ అనుచరులకు టెండర్లు కట్టబెట్టేలా నిబంధనలు మార్చేసింది. ఇందులో భాగంగా టెండర్ దాఖలు చేసే కాంట్రాక్టర్లు తప్పనిసరిగా ప్లాంట్ డిస్టెన్స్ సర్టిఫికెట్ సమర్పించాలనే నిబంధనను తీసుకొచ్చింది. 

మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే పంచాయతీరాజ్ డీఈలు ఆ డిస్టెన్స్ సర్టిఫికెట్లు ఇస్తుండడంతో  వారు మాత్రమే ఇ-ప్రొక్యూర్మెంట్కు దరఖాస్తు చేసుకోగలుగుతున్నారు. కాంట్రాక్టర్లుగా పది, ఇరవై ఏళ్లు అనుభవం ఉండి, వర్క్ ప్లేస్ కు సమీపంలోనే ప్లాంట్ ఉన్నప్పటికీ డిస్టెన్స్ సర్టిఫికెట్ లేక చాలా మంది టెండర్ వేయలేకపోతున్నారు. 

గ్రామీణ రోడ్ల రూపు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంజీఎస్వై స్కీమ్ ను అమలు చేస్తోంది. పీఎంజీఎస్వై ఫేజ్– 3లో భాగంగా తెలంగాణలోని 30 జిల్లాల్లో 1,207 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణం కోసం రూ.800.98 కోట్లు, బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.283.53 కోట్లు మంజూరు చేసింది. మొత్తంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో 289 పనుల కోసం రూ.1,084.51 కోట్లు రాష్ట్రానికి

ఈ పనులు చేపట్టేందుకు మే 17 నుంచి  23 వరకు ఈ ప్రొక్యూర్మెంట్ద్వారా టెండర్లు పిలిచారు. రోడ్డు, బ్రిడ్జి పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు చెందిన క్రషర్, ఇతర మెషినరీ ప్లాంట్లు వర్క్ ప్లేస్ కు 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. ఈ డిస్టెన్స్ ను సంబంధిత పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధ్రవీకరిస్తూ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది.

అయితే ఈఈలు ఎవరికీ డిస్టెన్స్ సర్టిఫికెట్లు జారీ చేయకపోవడంతో టెండర్ బిడ్ వేయలేదు. దీంతో మళ్లీ ప్రభుత్వం 5 శాతం ఎక్సెస్ తో రెండోసారి టెండర్లు పిలిచింది. ఏప్రిల్ 30 నుంచి మొదలైన టెండర్ల స్వీకరణ ఈ నెల10తో ముగియనుంది.

సర్టిఫికెట్ల కోసం ఈఈల దగ్గరికి వెళ్తే స్థానిక  మంత్రి లేదా ఎమ్మెల్యే అనుమతి లేనిదే తాము డిస్టెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేమని వారు తెగేసి చెబుతున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. 70 కిలోమీటర్ల పరిధిలోనే ప్లాంట్ ఉన్నా ఏదో ఒక సాకుతో తమ అప్లికేషన్ పెండింగ్ లో పెడుతున్నారని, ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే సర్టిఫికెట్ ఇస్తున్నారని వెల్లడించారు. 

‘మీకు ఒక్కరికే డిస్టెన్స్ సర్టిఫికెట్ ఇచ్చి టెండర్ దక్కేలా చూస్తాం.. కాకపోతే ఎమ్మెల్యేకు ముందే వర్క్ లో ఐదు పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది’ అని కొందరు ఈఈలే ఆఫర్ ఇస్తుండడంతో కాంట్రాక్టర్లు అవాక్కవుతున్నారు. తమ ప్లాంట్ 70 కిలోమీటర్ల పరిధిలో లేకపోతే తమను అనర్హులుగా ప్రకటించి, తాము వేసిన టెండర్లను రద్దు చేయొచ్చని, కానీ ఇలా సర్టిఫికెట్ ఇవ్వకుండా, టెండర్ వేయనీయకుండా అడ్డుకోవడం సరికాదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సర్టిఫికెట్ల పేరుతో ఎమ్మెల్యేలు ఇ– ప్రొక్యూర్ మెంట్ విధానానికి పాతరేస్తూ కమీషన్లు ఇచ్చినోళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.