అమరరాజా కంపెనీకి హైకోర్టులో ఊరట

టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నేతృత్వంలోని నడుస్తున్న అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ వల్ల కాలుష్యం ఏర్పడుతున్నందున…చిత్తూరు జిల్లాలో ఉన్న దాని ప్లాంట్లను మూసివేయాలని ఇటీవల రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. 
 
అదేవిధంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని ఆదేశించడంతో ఎలక్ట్రిసిటీ బోర్డు పవర్‌ కట్‌ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అమర రాజా యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న ధర్మాసనం కంపెనీ మూసివేయాలని పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. 
 
అంతేకాదు.. విద్యుత్ పునరుద్ధరణ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ 17 లోపు కాలుష్య నియంత్రణ మండలి చేసిన సూచనలు అమలు చేయాలని సంస్థకు ఆదేశాలిచ్చింది. అదేవిధంగా జూన్‌ 17న తర్వాత పరిశ్రమను మళ్లీ తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలికి సూచిస్తూ..తదుపరి విచారణను జూన్‌ 28కి వాయిదా వేసింది.
తాము కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను అమలు చేయడానికి చర్యలు ప్రారంభించామని, పైగా రక్షణ, టెలికాం, ఆసుపత్రులు వంటి కీలక రంగాలకు  తమ సరఫరాలు నిలిచి పోకుండా తాత్కాలిక ప్రణాళికలు కూడా రూపొందించామని కంపెనీ తెలిపింది.