సాగర్‌లో నోముల భగత్‌ గెలుపు

నాగార్జున సాగ‌ర్ కు జ‌రిగిన‌ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌ విజ‌యం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ 18 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య అకాల మ‌ర‌ణంతో సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. 

ఈ క్ర‌మంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌క్రియ జ‌రిగిన విష‌యం తెలిసిందే. నోముల భ‌గ‌త్ ప్ర‌తి రౌండ్‌లోనూ మంచి ఆధిక్యం క‌న‌బ‌రిచారు. వ‌రుస‌గా తొలి తొమ్మిది రౌండ్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించ‌గా, 10, 11, 14వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 

మ‌ళ్లీ మిగ‌తా అన్ని రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రద‌ర్శించింది. 25వ రౌండ్‌ ముగిసేసరికి 18,449 ఓట్ల మెజారిటీతో భగత్ విజయం సాధించారు. . ఇక కాంగ్రెస్‌కు 59, 239 ఓట్లు, బీజేపీకి 6,365 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానంలో నిలువగా, బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాకుండా పోయింది. 

ఘనవిజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి నోముల భగత్‌ మీడియాతో స్పందించారు. ‘నన్ను ఆశీర్వదించిన నాగార్జున సాగర్‌ ప్రజలకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.  ఈ విజయాన్ని కేసీఆర్‌కు అంకితం చేస్తున్నాను. నాన్న గారి ఆశయాలను కచ్చితంగా నెరవేస్తున్నాన’ని నోముల భగత్‌ తెలిపారు. నా గెలుపుకు కృషి చేసిన టీఆర్‌ఎస్‌ శ్రేణులకు రుణపడి ఉంటానని తెలిపారు. అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇచ్చారు.