నందిగ్రామ్ లో మమతా ఓటమి 

పశ్చిమ బెంగాల్ లో వరుసగా మూడో సారి అఖండ విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడుతున్న తృణమూల్ కాంగ్రెస్ కు ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుండి ఓటమి  చెందడం మింగుడు పడటం లేదు. తోలినుండి తీవ్ర ఉత్కంఠను రేపిన ఈ నియోజకవర్గంలో   చివరకు బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి విజయం సాధించారు.

మొదట 1200 ఓట్లతో మమత గెలిచారని జాతీయ మీడియాలో  వార్తలొచ్చాయి. అయితే చివరికి సుబేందు 1,622 పైగా ఓట్లతో గెలుపొందారు. అయితే ఓట్ల లెక్కింపులో ఏర్పడిన గందరగోళం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే సుబేందు గెలుపును ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు సుబేందు గెలుపును బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘‘సీఎం మమత నందిగ్రామ్‌లో ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి 1,622 ఓట్లతో విజయం సాధించారు.ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా దీదీ సీఎం పదవిలో కొనసాగడానికి ఏం అధికారం ఉంది?’’ అంటూ అమిత్ మాలవ్య పేర్కొన్నారు.

అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈసీ నందిగ్రామ్ ఫలితాన్ని ప్రకటించాల్సి ఉందని, పుకార్లు వ్యాపింపచేయవద్దని సూచించింది. మరోవైపు సీఎం మమతా బెనర్జీ కూడా స్వయంగా ఈ ఓటమిని అంగీకరించారు.

‘‘నందిగ్రామ్ గురించి ఏమీ చింతించకండి. ఒక్క సీటుతో వచ్చేదేమీ ఉండదు. పోయేదేమీ ఉండదు. నందిగ్రామ్ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నాను. నందిగ్రామ్‌లో ఏం జరిగిందో మరిచిపోండి. మనం బెంగాల్‌ను గెలిచాం.’’ అంటూ మమత పేర్కొన్నారు.

అక్క‌డ ఉద్య‌మంలో పాల్గొన్నాను కాబట్టి.. నందిగ్రామ్‌లో పోరాడాను. నందిగ్రామ్ ప్ర‌జ‌లు ఏ తీర్పు అయినా ఇవ్వ‌నీ. దానిని నేను అంగీక‌రిస్తాను. నేనేమీ ప‌ట్టించుకోను. మ‌నం 221 సీట్ల‌కుపైగా గెలిచాం.. బీజేపీ ఓడిపోయింది అని మ‌మ‌తా పేర్కొన్నారు. మరోవైపు ఈ ఫలితంపై మమతా బెనర్జీ కోర్టుకు వెళ్తానని ప్రకటించారు.