కొవాగ్జిన్ టీకా ధర తగ్గింపు 

ప్రముఖ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ తన కొవాగ్జిన్ టీకా ధరను తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ. 600లకు సరఫరా చేస్తామని గతంలో ప్రకటించిన భారత్ బయోటెక్ తాజాగా ధరలో రూ. 200ల కోత విధించింది. ఒక్కో డోసును రూ. 400కే రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేస్తామని ప్రకటించింది. 

ఇక ప్రైవేటు ఆస్పత్రులకు ఒక్కో డోసును రూ. 1200కు సరఫరా చేస్తామని పేర్కొంది. ‘‘ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజారోగ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని, రూ. 400కే కొవాగ్జిన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయాలని నిర్ణయించాము’’ అని భారత్ బయోటెక్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 

ధరల విషయంలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని కూడా సంస్థ పేర్కొంది. కాగా.. సీరం ఇన్‌స్టిట్యూట్ తన కరోనా టీకా ధరలో కోత విధించిన మరుసటి రోజే భారత్ బయోటెక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు.. రెండు కంపెనీలు తమ టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా కేంద్రం ఇటీవలే భారీగా నిధులు విడుదల చేసింది.