10 రాష్ట్రాలలో డబుల్ మ్యూటెంట్ కరోనా

దేశంలోని 10 రాష్ట్రాలలో డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. డబుల్ మ్యూటెంట్ వైరస్‌తో విస్తృతంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. గతంలో కరోనా వైరస్ వచ్చి తగ్గిన వారిలో మరోసారి కరోనా పాజిటివ్ వస్తోంది. 
 
డబుల్ మ్యూటెంట్ వైరస్‌తో 18 నుండి 45 సంవత్సరాలలోపు వారిలో మరణాల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ఉత్పరివర్తన జాతులు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. 
కోవిడ్-19 కేసులు వేగంగా పెరగడంలో ఈ మార్పుచెందిన వైరస్ కలిగిన వారు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్య వర్గాలు అంటున్నాయి. ఢిల్లీలో యూకే స్ట్రెయిన్, డబుల్ మ్యూటేషన్లతో కూడిన జాతులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
గత కొద్ది రోజులుగా లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు రికార్డవుతుండగా.. తాజాగా రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. గురువారం 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్‌-19 బారిన పడి మరణించేవారి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. మహమ్మారి బారినపడి మరో 1,038 మంది మృతువాతపడ్డారు. 
 
కరోనా మహమ్మారి మొదలైన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్‌ 18న 1,033 మరణాలు సంభవించాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ.. కేసులు ఏమాత్రం తగ్గకపోగా.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది
 కాగా, హరిద్వార్‌లో జరుగుతున్న పవిత్ర కుంభ మేళాకు వెళ్లి వచ్చిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ కర్నాటక ప్రభుత్వం ఆదేశించింది. విధిగా కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని కోరింది.