సంస్కృతం జాతీయ అధికార భాషగా అంబేద్కర్ ప్రతిపాదన

జాతీయ అధికార భాషగా సంస్కృతాన్ని అమలు చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిపాదించారని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే చెప్పారు. ప్రాచీన భారత దేశంలోని న్యాయ శాస్త్రం అరిస్టాటిల్, పర్షియన్ తర్కానికి ఇసుమంతైనా తక్కువైనది కాదని స్పష్టం చేశారు. 

మన పూర్వీకుల మేధాశక్తి నుంచి మనం లబ్ధి పొందడం మానుకోవడానికి కారణం ఏదీ కనిపించడం లేదని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం కోవిడ్-19 నిబంధనల ప్రకారం వర్చువల్ పద్ధతిలో జరిగింది.

ప్రజలకు కావలసినది ఏమిటో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు బాగా తెలుసునని జస్టిస్ బాబ్డే చెప్పారు. ఆయన రాజకీయ, సాంఘిక సమస్యలను అర్థం చేసుకున్నారని తెలిపారు. అధికారిక జాతీయ భాషగా సంస్కృతాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారని చెప్పారు. 

అరిస్టాటిల్, పర్షియన్ విధానంలోని తర్కం కన్నా మన పూర్వీకులు రాసిన న్యాయశాస్త్రం కొంచెమైనా తక్కువైనది కాదని తెలిపారు. మన పూర్వీకుల మేధాశక్తి నుంచి మనం లబ్ధి పొందడం మానుకోవడానికి, దానిని వదిలిపెట్టడానికి, పట్టించుకోవడం మానేయడానికి తగిన కారణం ఏదీ లేదన్నారు. 

డాక్టర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయనను జస్టిస్ బాబ్డే గుర్తు చేసుకున్నారు. ‘‘ఈరోజు ఉదయం నేను ఏ భాష గురించి మాట్లాడాలనే విషయంపై సందిగ్ధంలో పడ్డాను. ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి. ఇది నాకు గుర్తు చేస్తున్నదేమిటంటే, మాట్లాడేటపుడు ఉపయోగించవలసిన భాష, పని చేసేటపుడు వాడవలసిన భాష మధ్య సంఘర్షణ చాలా పాతదే’’ అని పేర్కొన్నారు. 

సబార్డినేట్ కోర్టుల్లో వాడవలసిన భాష ఏదో చెప్పాలని సుప్రీంకోర్టుకు చాలా వినతులు వస్తూ ఉంటాయని చెబుతూ ఈ విషయంపై పరిశీలన జరగడం లేదనేది విచారం వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఈ పార్శ్వాన్ని ముందుగానే ఊహించారని చెప్పారు. 

సంస్కృతం యూనియన్ ఆఫ్ ఇండియా అధికారిక భాష కావాలని ప్రతిపాదించారని చెప్పారు. ఈ ప్రతిపాదనపై కొందరు మౌల్వీలు, పండిట్లు, మత పెద్దలు, అంబేద్కర్ సంతకాలు చేశారని, అయితే ఇది రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారో, లేదో తనకు గుర్తు లేదని తెలిపారు. 

‘‘ఉత్తరాదిలో తమిళం అంగీకార యోగ్యం కాదు కాబట్టి, దానిని వ్యతిరేకిస్తారని, అదేవిధంగా హిందీని దక్షిణాధిలో వ్యతిరేకిస్తారని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. సంస్కృతానికి ఉత్తరాది, దక్షిణాదిలలో వ్యతిరేకత ఉండే అవకాశం తక్కువ ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆయన ఆ ప్రతిపాదన చేశారు, కానీ ఇది విజయవంతం కాలేదు’’ అని సీజేఐ చెప్పారు. 

దేశ ప్రజలకు, పేదలకు ఏం కావాలో డాక్టర్ అంబేద్కర్‌కు తెలుసునన్నారు. ఈ పార్శ్వాలన్నిటి గురించి ఆయనకు పరిపూర్ణంగా తెలుసునన్నారు. అందుకే ఆయన ఈ ప్రతిపాదన చేశారని అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. 

న్యాయ శాస్త్రాన్ని బోధించే కళాశాల అనేది నర్సరీ వంటిదని, ఇక్కడి నుంచే లీగల్ ప్రొఫెషనల్స్, జడ్జీలు వస్తారని సీజేఐ చెప్పారు. మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ వల్ల అనేక మంది కలలు నిజమవుతాయన పేర్కొన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులకు జాతీయ దృక్పథాన్ని బోధిస్తారని తెలిపారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చినవారు ఇక్కడ ఫ్యాకల్టీ సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రాంతీయతత్వం, సంకుచిత భావాలు వంటివేవీ ఇక్కడ లేవన్నారు.