రైళ్ల రద్దు, సర్వీసుల కుదింపు ఆలోచనలు లేవు 

దేశంలో రైళ్ల రద్దు కానీ, సర్వీసుల కుదింపు ఆలోచనలు కానీ లేవని రైల్వే బోర్డు చైర్మన్‌ సునీత్‌ శర్మ స్పష్టం చేశారు. రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని సర్వీసులు నడిపేందుకూ సిద్ధమని ప్రకటించారు. కరోనా ఉధృతి కారణంగా లాక్‌డౌన్‌ విధిస్తారన్న అనుమానాలతో ప్రజలు, వలస కూలీలు పెద్దఎత్తున స్వస్థలాలకు పయనమవుతున్నారని పేర్కొన్నారు. 

దీంతో రైళ్లలో రద్దీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో బోర్డు చైర్మన్‌ సహా పలువురు అధికారులు ఈ మేరకు స్పష్టతనిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అత్యవసరమైతే మరిన్ని సర్వీసులు నడుపుతామని సునీత్‌శర్మ పేర్కొన్నారు. 

కాగా, వేసవి కావడంతో రద్దీ సహజమని.. అందుకుతగట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రయాణికులకు కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం తప్పనిసరి అన్న వార్తలనూ సునీత్‌ ఖండించారు. సర్వీసుల రద్దు, కుదింపుపై మహారాష్ట్ర నుంచి తమకేమీ సమాచారం రాలేదని స్పష్టం చేశారు. 

స్టేషన్లు కిటకిటలాడుతున్నాయంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతు న్న సమాచారాన్ని నమ్మొద్దని సదరన్‌ రైల్వే జీఎం జాన్‌థామస్‌ ప్రజలకు సూచించారు. పాత వీడియో లు, తప్పుడు సమాచారాన్ని షేర్‌ చేయొద్దని కోరారు.  

కాగా, దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నడిపే ప్రత్యేక రిజర్వేషన్‌ రైళ్లలో రద్దీ పెద్దగా లేదని, స్టేషన్లలోనూ జన సమూహలు ఉండడం లేదని జోనల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా తెలిపారు. రోజుకు సగటున 180 రిజర్వుడు రైళ్లను నడుపుతున్నామని చెప్పారు. రద్దీ, స్టేషన్లలో జన సందోహం, కరోనా నిబంధనలు పాటించడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మొద్దని ప్రజలను కోరారు.

 గజానన్‌ మాల్యా సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం నుంచి శుక్రవారం వర్చువల్‌గా విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నాందేడ్‌, ఔరంగాబాద్‌, పుణె, తిరుపతి సహా దేశంలోని అన్ని వైపులకు రెగ్యులర్‌ రైళ్లను ప్రత్యేక రైళ్లుగా నడుపుతున్నామని వివరించారు.