బెంగాల్‌లో ఎన్నార్సీ అమలు ఆలోచనే లేదు  

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నార్సీ అమలుకు ప్రణాళికలేవీ లేవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయ్వ‌ర్గియ స్పష్టం చేశారు. అయితే, పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ) ను అమలుచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఎన్నార్సీని అప్‌డేట్ చేస్తుందని, తద్వారా ప్రజల పౌరసత్వ హక్కులను హరించుకుంటుందని ప్రతిపక్ష వాదనలను ఆయన తిప్పికొట్టారు. 

‘పశ్చిమ బెంగాల్‌లో ఎన్నార్సీని అమలుచేసే ఆలోచన ఏదీ కేంద్రం వద్ద లేదు. అయితే, సీఏఏను అమలుచేయాలని అనుకుంటున్నది. ఎందుకంటే పొరుగు దేశాలలో మతపరమైన హింస నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చిన శరణార్థులకు హక్కులు కల్పించాలని తమ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది’ అని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా.. ఎన్నికల అనంతరం సీఏఏను అమలు చేయడానికి మాత్రమే ఎదురు చూస్తున్నామని స్పష్టం చేశారు. హింసకు గురైన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నందున.. ఇది మాకు ముఖ్యమైన సమస్య అని చెప్పారు. 

ఎన్నికల్లో గెలిచినా ఎన్నార్సీని చేపట్టే ఆలోచనగానీ, ప్రణాళికగానీ తమకు లేదని ఆయన తేల్చి చెప్పారు. కొత్త పౌరసత్వ చట్టం అమలుతో భారతదేశంలో 1.5 కోట్లకు పైగా ప్రజలకు, ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే 72 లక్షలకు పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.

బీజేపీ శిబిరానికి వ్యతిరేకంగా టీఎంసీ తప్పుడు ప్రచారం నిర్వహిస్తోందని ఆరోపిస్తూ.. చాలా మందికి ప్రయోజనం చేకూర్చే సీఏఏను రాష్ట్రంలోని అధికార పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని 64 ఏండ్ల నాయకుడు ఆశ్చర్యపోయారు.

‘మమతా బెనర్జీ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎన్నికల కమిషన్‌ పాక్షికంగా పనిచేస్తుందని ఎన్నడూ భావించలేదు. గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఎన్నికల్లో గెలిచినప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ ఓటమిని గ్రహించడం ప్రారంభించిన తర్వాత ఈసీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిందిస్తున్నారు’ అని విజయ్వ‌ర్గియా ఎద్దేవా చేశారు.