మ‌హారాష్ట్ర హోంమంత్రిపై సీబీఐ ప్రాథ‌మిక విచార‌ణ‌

మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ క‌మిష‌న‌ర్ ప‌ర‌మ్ బీర్ సింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ ప్రాథ‌మిక విచార‌ణ‌కు బాంబే హైకోర్టు ఆదేశించింది. 15 రోజుల్లో ఈ విచార‌ణ పూర్తి చేయాల‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. 

హోంమంత్రిపై తాను ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రేకు ఫిర్యాదు చేసిన కార‌ణంగానే త‌న‌ను బ‌దిలీ చేశార‌ని ప‌ర‌మ్ బీర్ ఆరోపించారు. పోలీసు అధికారుల‌కు నెల‌కు రూ.100 కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యం విధించార‌ని, అక్ర‌మ బదిలీలు చేశార‌ని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ప‌ర‌మ్ బీర్ ఆరోప‌ణ‌లు గుప్పించారు.

గ‌త విచార‌ణ‌లో ఈ ఆరోప‌ణ‌ల‌పై ఎందుకు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేదంటూ బాంబే హైకోర్టు ఆయ‌న‌ను ప‌దే ప‌దే ప్ర‌శ్నించింది. కేసులో హోంమంత్రి, ముఖ్య‌మంత్రి ఉన్నార‌ని చ‌ట్టాల‌ను ప‌క్క‌న పెడ‌తారా? ప్ర‌ధాని జోక్యం ఉంటే ఎవ‌రు విచార‌ణ జ‌రుపుతారు? బ‌య‌టి నుంచి అతీత శ‌క్తులు ఏవైనా వ‌స్తాయా అని విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.