21 మంది పోలీస్ అధికారులపై 1100 ప్రశ్నలను సంధించిన ఎబివి 

టిడిపి హయాంలో నిఘా విభాగం అధిపతిగా వ్యవహరించిన సీనియర్ పోలీస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు ప్రస్తుత ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడంపై సవాల్ చేస్తూ విచారణ సంఘం ముందు 14 రోజుల ముందు తన వాంగ్మూలం ఇవ్వడమే కాకుండా 21 మంది పోలీస్ అధికారులను 1100 ప్రశ్నలతో క్రాస్ ఎక్సమినేషన్ చేశారు. తన సస్పెన్షన్ కు ఎటువంటి ఆధారాలు లేవని ఈ సందర్భంగా బలమైన వాదనలు వినిపించారు. 
చట్టం, మానవత్వం ముందు మాత్రమే తాను తలవంచుతానని స్పష్టం చేశారు. బెదిరింపులకు, క్రూరశక్తులకు తలవంచనని.. వాటిని బద్దలు కొడతానని తేల్చిచెప్పారు. సస్పెన్షన్‌లో ఉన్న ఆయనపై రాష్ట్రప్రభుత్వం వేసిన ఎంక్వైరీ కమిషన్‌ విచారణ ఆదివారంతో ముగిసింది. విచారణ కమిషనర్‌ సిసోడియా ముందు ఆయన తన వాదనను రాతపూర్వకంగా సమర్పించారు.
 
తన తరఫున తానే వాదించుకుని సాక్షులను ప్రశ్నలడిగారు. ఆదివారం చివరి రోజు విచారణ ముగిసిన అనంతరం ఆయన వెలగపూడి సచివాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. 14 రోజులుగా కొనసాగిన విచారణ పూర్తయిందని.. తాను కూడా సాక్ష్యం ఇచ్చానని తెలిపారు. తనపై వచ్చిన అభియోగాలపై తానే వాదించుకున్నానని.. తన వాదన మొత్తం కమిషనర్‌ సావధానంగా విన్నారని వెల్లడించారు. సాక్షులను తానే క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశానని.. కొందరు సంతృప్తిగా సమాధానం చెప్పారని.. ఇంకొందరు వారికి నచ్చినట్లుగా చెప్పారని తెలిపారు.
వివరాలు, వాస్తవాలు అన్నీ రికార్డు అయ్యాయని.. కమిషనర్‌ వాస్తవాలను పరిశీలించి త్వరలోనే తన నిర్ణయం చెబుతారని పేర్కొన్నారు. తన కేసులో కొన్ని కృత్రిమ డాక్యుమెంట్లు, ఫోర్జరీ మెయిల్స్‌ సృష్టించారని, వీటన్నింటిపైనా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని ఏబీ తెలిపారు. ఇంతకూ ఈ కేసులో మీరేం చెప్పదలచుకున్నారని ప్రశ్నించగా.. ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. కళ్లలో కన్నీటి జీర కనిపించింది.
‘నా వాదనకు ఇంత అవకాశమిచ్చిన సుప్రీంకోర్టుకు రుణపడి ఉంటాను. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి వాదనలు వినిపించుకునే అవకాశమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికీ కృతజ్ఞతలు’ అని తెలిపారు. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారమంతా డీజీపీ కార్యాలయానికి.. ప్రత్యేకించి ఆ కార్యాలయంలోని పీఅండ్‌ఎల్‌ విభాగానికి సంబంధించిందని పేర్కొన్నారు.
‘ ఏసీబీ చేసిన విచారణలో సాక్షుల్ని బెదిరించారు. తప్పుడు సమాచారంతో నివేదికలు పంపించారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలని విఫల యత్నం చేశారు. దీంతో సంబంధం లేని వ్యక్తుల వ్యవహారాల్లోకి కూడా అక్రమంగా చొరబడ్డారు. మీడియాలో ప్రభుత్వ విభాగాలే తప్పుడు ప్రచారం చేశాయి. తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించేందుకు ఒక ఈ-ఫైల్‌ను విచారణ సందర్భంగా తయారుచేసేశారు’ అంటూ ఆరోపించారు. 
 
చట్టానికి లోబడి పనిచేయాల్సిన కొందరు సీనియర్‌ అధికారులు సాక్ష్యాల తారుమారు, ఫోర్జరీ, ట్యాంపరింగ్‌లాంటి అసహ్యకరమైన పనులకు పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు.  ‘మా అబ్బాయికి గానీ, అతడి కంపెనీకి గానీ ఇజ్రాయెల్‌ కొనుగోలుతో ఎలాంటి సంబంధాల్లేవు” అని స్పష్టం చేశారు.  
 
“నాపై వచ్చిన అభియోగాలను విచారిస్తున్న సంస్థ ఇజ్రాయెల్‌ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కూడా మా అబ్బాయి పాత్ర ఏమీ లేదని స్పష్టంగా తేలింది. ఇజ్రాయెల్‌ కంపెనీతో అతడి కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో మాత్రం వ్యాపారం చేయడానికి అర్హత లేదని స్పష్టంగా పేర్కొంది. కానీ దీనిని రాష్ట్రప్రభుత్వం కావాలని ఎందుకు దాస్తోందనేది అంతుపట్టని విషయం’  అంటూ వివరించారు.