బైడెన్ ఆహ్వానాన్ని అంగీక‌రించిన ప్ర‌ధాని మోదీ

పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందంపై ఏప్రిల్ 22, 23 తేదీల్లో నిర్వ‌హించే వ‌ర్చువ‌ల్ భేటీకి అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ఇ టీవ‌లే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఆహ్వానించారు. బైడెన్ ఆహ్వానాన్ని మోదీ అంగీక‌రించిన‌ట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్ర‌తినిధి అరింద‌మ్ భ‌గ్చీ తెలిపారు.

ఈ స‌మావేశంలో చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఆ మీటింగ్‌లో పాల్గొంటారు. పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందంలో మ‌ళ్లీ చేరేందుకు బైడెన్ సుముఖంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సుమారు 40 దేశాల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. 

రెండు రోజుల జ‌రిగే మీటింగ్‌లో మోదీతో పాటు ఇత‌ర దేశాధినేత‌లు కూడా పాల్గొంటారు. అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందం నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. అయితే తాను ఎన్నికైతే ఆ ఒప్పందంలో మ‌ళ్లీ చేరుతాన‌ని ఎన్నిక‌ల వేళ బైడెన్ వాగ్దానం చేశారు. 

జ‌పాన్ ప్ర‌ధాని యోషిహిడే సుగా, బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో, కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో, ఇజ్రాయిల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెతాన్యూ, సౌదీ రాజు స‌ల్మాన్ బిన్ అల్ సౌద్‌, బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌లు ఆ స‌మావేశంలో పాల్గొంటారు.