సాగు చట్టాలపై నివేదిక సమర్పించిన `సుప్రీం’ కమిటీ 

కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఏప్రిల్ 5న దీనిని సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. ఈ కమిటీ సభ్యుడు, వ్యవసాయ ఆర్థికవేత్త అనిల్ ఘన్వత్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త సాగు చట్టాలపై నివేదికను  రూపొందించి, మార్చి 19న సీల్డ్ కవర్లో పెట్టి అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించినట్లు తెలిపారు.

ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందువల్ల మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబరు చివరి నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాడుతున్న సంగతి తెలిసిందే.

ఈ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో వీరంతా ఉద్యమిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి భరోసా కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.  ప్ర‌భుత్వంతో ఎన్నో రౌండ్ల చ‌ర్చ‌లు జరిగినా అవి కొలిక్కి రాలేదు.  ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఓ కమిటీని నియమించింది. ఈ చట్టాలను పరిశీలించి, సంబంధితులందరితో మాట్లాడి, నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిటీలో ఘన్వత్, అశోక్ గులాటి, ప్రమోద్ జోషీ ఉన్నారు.

కొత్త సాగు చట్టాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ కమిటీ 85 రైతు సంఘాలు, సంబంధిత ఇతరులతో మాట్లాడింది. సుమారు నాలుగు నెలల నుంచి ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ చట్టాలను పార్లమెంటు 2020 సెప్టెంబరులో ఆమోదించింది. గ‌త జ‌న‌వ‌రి 12న వ్య‌వ‌సాయ చ‌ట్టాల అమ‌లుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విష‌యం తెలిసిందే. రెండు నెల‌ల పాటు అమ‌లును నిలిపేసి క‌మిటీని నియ‌మించిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. ఆలోపు నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది.