ఎమ్మెల్యే అరుణ్‌పై దాడిపై భగ్గుమన్న బీజేపీ

పంజాబ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్‌ నారంగ్‌పై దాడి ఘటన రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. దాడి ఘటనపై రాష్ట్ర బీజేపీ శాఖ ఆందోళన చేపట్టింది. ఘటనను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వనీ శర్మ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆదివారం ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అధికార నివాసం ఎదుట ధర్నా నిర్వహించాయి. 
 
ఈ స్థాయిలో ప్రజాస్వామ్యానికి  విఘాతం కలగడం తామెన్నడూ చూడలేదని శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ముకుట్‌సర్‌ జిల్లా మాలౌట్‌ ప్రాతంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన అరుణ్‌ను సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అక్కడి రైతులు చుట్టుముట్టారు. ఆయన దుస్తులపై ఇంకు చల్లి, బట్టలు చింపేసి.. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. 
 
పోలీసులు అక్కడే ఉన్నా ఆందోళనకారులను అదుపు చేయడం వారికి వీలుకాలేదు. కొద్దిసేపటికి ఎలాగోలా అరుణ్‌ను రక్షించి, అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ఓ ఎస్పీ తలకు గాయాలవ్వగా ఆస్పత్రికి తరలించారు.  రైతులకు ఆందోళనలు చేసుకునే హక్కు ఉన్నా ఇలాంటి ఘటలను ఉపేక్షించబోమని సీఎం అమరీందర్‌ సింగ్‌ అదే రోజున హెచ్చరించారు. 
 
ఎమ్మెల్యేపై దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. కాగా ఎమ్మెల్యే అరుణ్‌ సింగ్‌పై దాడి ఘటనను పంజాబ్‌ గవర్నర్‌ వీపీ సింగ్‌ బద్నౌర్‌ తీవ్రంగా ఖండించారు. దాడి ఘటనపై నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.