
దేశంలో 46 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్రం గుర్తించింది. కరోనా కేసులు పెరిగే రాష్ట్రాల్లో టీకాలు, పరీక్షలు పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. కఠిన చర్యలు, కంటైన్మెంట్ జోన్లతో కట్టడి చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా, కొత్త కేసుల్లో 73.64 శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 35,952 కేసులు నమోదయ్యాయి.
కరోనాపై 12 రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష జరిపింది. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, బిహార్ రాష్ట్రాలపై కేంద్రం కీలక సమీక్ష నిర్వహించింది. కరోనా కేసుల వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రాల్లో చేపట్టిన చర్యలపై ఆరా తీసింది.
కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో రానున్న పండుగ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. త్వరలో రానున్న హోలీ, ఈస్టర్, ఈద్–ఉల్–ఫితర్ తదితర పర్వదినాల్లో పౌరులు మరింతగా గుమికూడినపుడు కరోనా వైరస్ మరింతగా వ్యాప్తిచెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది.
స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, ఎగ్జిబిషన్‌లు వంటి వాటికి సంబంధించి ఈ నెల 23న హోంశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిందని వాటిని అనుసరించాలని సూచించింది.
కాగా, కరోనా కట్టడికి ముంబైలో ఈనెల 28 రాత్రి పదిగంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమలవుతుందని నగర మేయర్ కిషోరి పెడ్నేకర్ తెలిపారు. కర్ఫ్యూ వేళల్లో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతిస్తామని, హోటళ్లు, పబ్‌లు మూతపడతాయని చెప్పారు. మురికివాడలతో పోలిస్తే అపార్ట్‌మెంట్లు, హైరైజ్ భవనాలున్న ప్రాంతాల్లోనే అధిక పాజిటివ్ రేటు కనిపిస్తోందని పేర్కొన్నారు.
అన్ని రకాల సమావేశాలపైనా ఏప్రిల్ 15 వరకు మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం7 గంటల వరకు ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువమంది గుమి కూడటానికి వీల్లేదు. మాల్‌లు, గార్డెన్లు, బీచ్‌లు మూసివేయాలి.
ఆంక్షల్ని ధిక్కరించినవారికి రూ.1000 జరిమానా విధిస్తారు. మాస్క్‌లు లేకుండా బయట తిరిగేవారు రూ.500 జరిమానా చెల్లించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ.1000 జరిమానా చెల్లించాలి. సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, రెస్టారెంట్లు నిర్దేశించిన సమయాల్లో మూసి వేయాలి. హోం డెలివరీ ఆహార ప్యాకెట్లకు అనుమతించారు.
More Stories
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు