మహారాష్ట్ర ప్రభుత్వం వసూళ్ళ కూటమి

మహారాష్ట్ర ప్రభుత్వం వసూళ్ళ కూటమి

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వసూళ్ళ కూటమి పరిపాలిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది బెదిరించి డబ్బు వసూలు చేసేవారి ద్వారా, వారి కోసం, వారి వల్ల ఏర్పాటైన కూటమి అని ధ్వజమెత్తారు.

మహారాష్ట్రలో కూడా ఆట జరుగుతోందని పేర్కొన్నారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) నిర్వహించిన మీడియా సమావేశాన్ని తాను గమనించానని చెప్పారు. కేవలం ఓ స్టేట్‌మెంట్‌ను మాత్రమే విడుదల చేశారని, విలేకర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని చెప్పారు.

మహారాష్ట్రలో జరుగుతున్నది వికాస్ (అభివృద్ధి) కాదని, వసూలీ (బెదిరించి డబ్బు వసూలు చేసుకోవడం) అని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. రూ.100 కోట్లు వసూలు చేయమని పోలీసులను ఆదేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ చేత రాజీనామా  చేయిస్తేనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ విశ్వసనీయత పునరుద్ధరణ జరుగుతుందని హితవు చెప్పారు.

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడుపుతున్నదెవరు? మహారాష్ట్ర చరిత్రలో ఇదే అత్యంత అయోమయమైన ప్రభుత్వమా? ఈ వసూలీ అఘాడీ రాజకీయ దిశ ఏమిటి? అని ప్రశ్నించారు. శరద్ పవార్‌కు రాజకీయ విశ్వసనీయత ఉందని పేర్కొంటూ ఆయన అనిల్ దేశ్‌ముఖ్‌ను ఎందుకు సమర్థిస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు.