సుప్రీంకోర్టుకు ప‌రమ్‌బీర్ సింగ్‌

సుప్రీంకోర్టుకు ప‌రమ్‌బీర్ సింగ్‌

మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ నెల‌కు రూ.100 కోట్లు వ‌సూలు చేసి ఇవ్వాల‌ని పోలీసు అధికారి స‌చిన్ వాజేను ఆదేశించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ముంబై పోలీస్ మాజీ చీఫ్ ప‌ర‌మ్‌బీర్ సింగ్‌.. తాజాగా సుప్రీంకోర్టుకూ వెళ్లారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న‌ సీబీఐ విచార‌ణ కోరారు.

త‌న‌ను హోంగార్డ్ డిపార్ట్‌మెంట్‌కు బ‌దిలీ చేయ‌డాన్ని స‌వాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన ప‌ర‌మ్‌బీర్‌.. అందులోనే త‌న ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌నీ కోరడం గ‌మ‌నార్హం. 

ముకేశ్ అంబానీ ఇంటి బ‌య‌ట పేలుడు ప‌దార్థాల కేసు విచార‌ణ మ‌ధ్య‌లో ఉన్న స‌మ‌యంలో ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌గా ఉన్న ప‌ర‌మ్‌బీర్‌ను బదిలీ చేశారు. ఆ వెంట‌నే ఆయ‌న హోంమంత్రిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రేకు లేఖ రాశారు. 

అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. అటు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ కూడా హోంమంత్రిని వెన‌కేసుకొచ్చారు. అంబానీ కేసు విచార‌ణ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే హోంమంత్రిపై ఈ ఆరోప‌ణ‌లు చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

 ముంబై సీపీ ప‌రంబీర్ సింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఇవాళ లోక్‌స‌భ‌లోని జీరో అవ‌ర్‌లో చ‌ర్చ జ‌రిగింది. ఆ స‌మ‌యంలో 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడారు. మ‌హారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాల‌ని వాళ్లు డిమాండ్ చేశారు.