సెబీ అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు

శారదా పోంజీ కేసుతో సంబంధం ఉన్న సెబీ అధికారుల ఇళ్లల్లో సీబీఐ సోమవారం సోదాలు నిర్వహించింది. ముంబైలోని సెబీ అధికారులకు చెందిన ఆరు ప్రాంతాల్లో సీబీఐ దాడులు చేసినట్లు సమాచారం. శారదా చిట్‌ఫండ్‌ కేసులో పలువురు సెబీ అధికారులకు డబ్బులు అందాయని సీబీఐ ఆరోపిస్తున్నది. శారదా పోంజీ కుంభకోణంతో ముగ్గురు అధికారులకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్న సీబీఐ.. వారి పేర్లను మాత్రం వెల్లడించడంలేదు.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో 2009-13 మధ్య వెలుగుచూసిన వేల కోట రూపాయల శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసులో ఇప్పటికే పలు ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో వేలాది మంది ఇన్వెస్టర్లను నిర్వాహకులతోపాటు కొందరు అధికారులు మోసం చేశారన్న అభియోగాలు నమోదయ్యాయి.

దీనిపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సీబీఐ అధికారులతో పంచుకోవాలని రాష్ట్ర ఉన్నతాధికారులకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో ముగ్గురు సెబీ ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు భావిస్తున్న సీబీఐ.. వారి కదలికలపై దృష్టిసారించింది.

తక్కువ పెట్టుబడి పెట్టి కొన్నిరోజుల్లోనే ఎక్కువ ఆదాయాన్ని పొందండి అంటూ శారదా చిట్‌ఫండ్‌ నిర్వాహకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఏజెంట్లను పెట్టుకుని వారికి 25 శాతం కమిషన్‌ ముట్టజెప్పి వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

కొన్ని సంవత్సరాల్లోనే రూ.2500 కోట్లు సేకరించినట్లు సీబీఐ పేర్కొంటున్నది. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, అసోం, త్రిపురల్లో కూడా ఏజెంట్లను నియమించి 1.7 మిలియన్ల మందిని ఇన్వెస్టర్లుగా చేసుకున్నారు.

అనంతర కాలంలో చేతులు ఎత్తేయడంతో ఎందరో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ కుంభకోణంలో రాజకీయనాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను నిందితులుగా చేర్చారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీబీఐ సోదాలు జరుగడం విశేషం.