గ్రామీణ ప్రజలకు రూ10 లకే ఎల్‌ఈడీ బల్బు

గ్రామీణ ప్రజలకు 10 రూ పాయలకే ఎల్‌ఈడీ బల్బులను అందించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) అనుబంధ కంపెనీ కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) శుక్రవారం ‘గ్రామ ఉజ్వల’ పథకాన్ని ఆవిష్కరించింది.  

కేంద్ర విద్యుత్తు, నూతన-పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ బీహార్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీం తొలి దశలో భాగంగా ఐదు రాష్ట్రాలలోని వివిధ గ్రామాల్లో విద్యుత్తును పొదుపు చేసే అత్యంత నాణ్యమైన 1.5 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను చౌకగా అమ్మనున్నారు.  

విజయవాడ (ఏపీ) సమీప గ్రామాలతోపాటు వారణాసి (యూపీ), నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర), అరహ్‌ (బిహార్‌), పశ్చిమ గుజరాతీ గ్రామాల్లో ఈ ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేయనున్నారు. మూడేండ్ల వారెంటీతో 7, 12 వాట్ల ఎల్‌ఈడీ బల్బులను అందివ్వనున్నారు.  

ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 5 బల్బులను విక్రయిస్తారు. వీటి వినియోగార్థం ఇండ్లలో మీటర్లనూ బిగించనున్నారు. ప్రభుత్వ సబ్సిడీ,  మద్దతు లేకుండానే ఈ బల్బ్ లను సరఫరా చేస్తుండడం గమనార్హం. ఈ పధకాన్ని ఐక్యరాజ్య సమితి స్వచ్ఛ ఇంధన కార్యక్రమం క్రింద నమోదు చేయడంతో ఇటువంటి సౌలభ్యం లభిస్తున్నది.