దేశంలో సంప్రదాయ మీడియా పబ్లిషర్లతో గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి టెక్ దిగ్గజాలు ప్రకటనల ఆదాయాన్ని పంచుకునేలా ఆస్ట్రేలియా తరహా కోడ్ను తీసుకురావాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ మోదీ ప్రభుత్వాన్ని కోరారు.
రాజ్యసభలో బుధవారం సుశీల్ మోదీ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయాలనే తపనతో భారీ పెట్టుబడులు పెట్టే సంప్రదాయ మీడియా పబ్లిషర్లకు ప్రకటనలే కీలక ఆదాయ వనరని, వీటిలో అధిక శాతం ఈ సాంకేతిక దిగ్గజ కంపెనీలో ఎగరేసుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారితో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ వంటి సంప్రదాయ మీడియా మునుపెన్నడూ లేని ఇబ్బందికరపరిస్ధితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం సంప్రదాయ మీడియాను తీవ్ర ఆర్థిక సంక్షోభం వెంటాడుతోందని గతంలో ఇది మహమ్మారి వల్ల ఉత్పన్నమైతే ప్రస్తుతం యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ వంటి సాంకేతిక దిగ్గజాల వల్ల సంక్షోభం నెలకొందని పేర్కొన్నారు.
భారీ పెట్టుబడులతో యాంకర్లు, జర్నలిస్టులు, రిపోర్టర్లకు ఉపాధి కల్పిస్తూ సంప్రదాయ మీడియా విశ్వసనీయ సమాచారాన్ని చేరవేసేందుకు కృషిచేస్తోందని చెప్పారు. టెక్ దిగ్గజాలు ఆదాయాలను సంప్రదాయ మీడియాతో పంచుకునేలా ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని తీసుకువచ్చేందుకు భారత్ చొరవ చూపాలని కోరారు.

More Stories
షట్డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు