మందకొడిగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు… ఆధిక్యంలో టీఆర్ఎస్ 

తెలంగాణలో రెండు  గ్రాడుయేట్ల స్థానాలకు ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రెండో రోజుకూడా కొనసాగుతోంది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ కౌంటింగ్ పూర్తి అయ్యేందుకు ఇంకోరోజు సమయం పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్లు పూర్తికాగా, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల ఓట్లు మూడో రౌండ్ లెక్కింపు పూర్తయింది.

హైదరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీ దేవి ప్రస్తుతం మొదటి స్థానంలో,  బీజేపీ అభ్యర్థి రామచంద్ర ‌రావు రెండో స్థానంలో, ప్రొఫెసర్ నాగేశ్వర్ మూడో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ మందకొడిగా సాగుతుండటంతో ప్రతీ టేబుల్‌కు అదనంగా ముగ్గురు సిబ్బందిని కేటాయించారు. శుక్రవారం గాని ఫలితం వెలువడే అవకాశం కనిపించడం లేదు. 

రెండో రౌండ్‌ ఫలితాల్లోనూ టిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమీప అభ్యర్థి రామచందర్ రావుపై వాణీదేవి 2,613 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండు రౌండ్లలో సురభివాణి దేవికి 35,171 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థి రామచంద్రరావు‌కు 32,558 ఓట్లు పోలయ్యాయి. 

మొదటి రౌండ్‌ ఫలితాల్లో సురభివాణికి మొదటి రౌండ్ లో సురభి వాణీదేవి(టిఆర్ఎస్)కి 17,439 ఓట్లు వచ్చాయి. రామచందర్ రావు(బిజెపి)కు 16,385, ప్రొ, నాగేశ్వర్ కు 8,357, చిన్నారెడ్డి (కాంగ్రెస్)కి 5,082, ఎల్. రమణ (టిడిపి)కి 929 ఓట్లు పడ్డాయి. మొదటి రౌండ్ లో 3,374 చెల్లని ఓట్లు నమోదయ్యాయి.

నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లారాజేశ్వర్‌రెడ్డి దూసుకుపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో ఉన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మాత్రం నాలుగు, ఐదు స్థానాల్లో ఉండటం గమనార్హం.

మూడు రౌండ్లలో కలిపి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లాకు 47,545, నవీన్‌కుమార్‌కు 34,864, కోదండరామ్‌కు 29,560 ఓట్లు పోలయ్యాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప అభ్యర్థిపై 12,681 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మెజార్టీతో గెలవడం ఖాయమని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో కాకపోయినా రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు మూడు రౌండ్లతో ఫలితాన్ని అంచనా వేయలేమని, మొత్తం ఏడు రౌండ్లు లెక్కించాల్సి ఉంటుందని చెప్పారు.  కాగా, ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.