
వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తల డీజీపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బైంసా అల్లర్లకు నిరసనగా, లవ్ జిహాదీలకు వ్యతిరేకంగా డీజీపీ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు.
లకడికపూల్‌లోని డీజీపీ కార్యాలయం వైపుగా కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వారిని అడ్డుకుని .. అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తల అక్రమ అరెస్టులను వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ఖండించాయి.
ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆందోళన కారులు ఒక్కసారిగా అక్కడికి దూసుకునిరావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇలా ఉండగా, వ్యతిరేకులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరోస్ సంస్థపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ ప్రోద్భలంతోనే హిందు మనోభావాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు.
ఈ సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిచారు. మీరు లెక్కలు తీస్తారా? కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడినుంచి తీయించమంటారా? అని నిలదీశారు. హిందువులను కించపరిచే కార్యక్రమాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏమి చేస్తోందని ప్రశ్నించారు.
చాలా ఏళ్లనుంచి ఈ కుట్ర జరుగుతోందన్నారు.ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ సీఎం మౌనం వహించడం ఆయన పతనానికి నాంది కాబోతోందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత