ఇప్పటివరకు 2.61 కోట్ల మందికి వ్యాక్సిన్ 

దేశంలో ఇప్పటివరకు 2.61 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 4.78 లక్షల సెషన్లలో వీళ్లందరికీ టీకాలు అందించామని చెప్పింది. ఇందులో 71 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లు, 70 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఫస్ట్ డోస్ ఇచ్చామని.. 39 లక్షల మంది హెల్త్ కేర్, 5.8 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు సెకండ్ డోస్ ఇచ్చామని తెలిపింది. 

అలాగే 45 ఏళ్ల కన్నా ఎక్కువ వయసుండి వివిధ రకాల వ్యాధులున్న 9.29 లక్షల మందికి, 55 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఫస్ట్ డోస్ వేశామంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ వ్యాక్సిన్లకు కొరత లేదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర సహా ఇంకొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశ ప్రజలను కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా ఇంకా తగ్గలేదని.. ప్రజలు అలసత్వం ప్రదర్శించొద్దని కోరింది. మహమ్మారి ఎప్పుడైనా విజృంభిచవచ్చని హెచ్చరించింది.

నీతిఆయోగ్ మెంబర్ వీకే పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రమవుతోంది. మళ్లీ వెనక్కి, లాక్డౌన్ పరిస్థితుల్లో వెళ్తున్నాం’అని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాప్తి ఎక్కువున్న జిల్లాల్లో వ్యాక్సినేషన్ స్పీడు పెంచాలన్నారు. ఢిల్లీ, చుట్టుపక్క ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  

గురువారం 22వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. శుక్రవారం భారీగా పెరిగాయి. కొద్దిరోజులుగా మళ్లీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 23,285 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,13,08,846కు పెరిగింది. కొత్తగా 15,157 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,09,53,303 మంది కోలుకున్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది. మరో 117 మంది వైరస్‌ ప్రభావంతో మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,58,306కు పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 1,97,237యాక్టివ్‌ కేసులున్నాయని చెప్పింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 1.74శాతం ఉన్నాయని, రికవరీ రేటు 96.86 శాతం ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే డెత్‌ రేటు 1.40శాతంగా ఉందని వివరించింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 2,61,64,920 డోసుల వ్యాక్సిన్‌ వేసినట్లు వివరించింది.