‘మైత్రి సేతు’ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ 

భారత్-బంగ్లాదేశ్ మధ్య నిర్మించిన ‘మైత్రి సేతు’ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారంనాడు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు. పొరుగుదేశమైన భారత్‌‌‌తో, ముఖ్యంగా ఈశాన్య భారతాన్ని కలుపుతూ ఇరుదేశాల మైత్రీ సంబంధాల పటిష్టతకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి బ్రిడ్జి ప్రారంభమే ఒక సాక్ష్యమని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. 
త్రిపురలోని భారత సరిహద్దు, బంగ్లాదేశ్ మధ్య ప్రవహించే ఫెని నదిపై ‘మైత్రీ సేతు’ను నిర్మించారు. 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన భారత్ లోని సబ్రూమ్‌ను బంగ్లాదేశ్‌లోని రామ్‌గఢ్‌తో కలుపుతుంది. రూ.133 కోట్ల ఖర్చుతో ఈ బ్రిడ్జిని నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించింది.
భారత్-బంగ్లా మధ్య మైత్రీ సంబంధాలకు గుర్తుగా దీనికి ‘మైత్రి సేతు’ అని పేరు పెట్టారు. మైత్రీ సేతుతో ఇరుదేశాల మధ్య వాణిజ్యం, రాకపోకల్లో ఒక అధ్యాయం నెలకొందని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.  కాగా, మంగళవారంనాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘మైత్రీ సేతు’ ప్రారంభోత్సవం జరిపిన సందర్భంగానే త్రిపురలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేశారు. సబ్రూమ్‌లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.
ఉనకోటి జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ఖోవై జిల్లా ప్రధాన కార్యాలయం వరకూ కలిపే ఎన్‌హెచ్ 208కి కూడా శంకుస్థాపన చేశారు. పీఎంఏవై (అర్బన్) కింద నిర్మించిన 40,978 గృహాలు, అగర్తలా స్మార్ట్ సిటీ మిషన్ కింద నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు.
సమ్మెల సంస్కృతితో ఏళ్ల తరబడి వెనుకబడిన త్రిపుర ఇప్పుడు సులభతర వాణిజ్యం దిశగా పురోగమిస్తోందని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. నూతన పరిశ్రమలు, పెట్టుబడులకు అవకాశాలు మెరుగయ్యాయని తెలిపారు. తొలిసారిగా త్రిపురలో ఆహార ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతోందని చెప్పారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద పని చేస్తున్న వారు ఇవాళ రూ.135కు బదులు రూ.205 పొందుతున్నారని తెలిపారు.