విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేదు 

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైసిపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు సంబంధించి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవని పేర్కొంటూ  స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై జగన్‌ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని ఆమె వెల్లడించారు. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు.  

‘‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి వాటా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి దీనితో ఎలాంటి సంబంధం లేదు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నాం. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తాం’’ అంటూ కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బదులిచ్చారు.

జనవరి 27న జరిగిన ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ భాగస్వాములు, ఉద్యోగులు షేర్లు కొనుగోలు చేసే విధంగా ప్రతిపాదనలు చేసిన్నట్లు ఆమె చెప్పారు.

కాగా,  విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నదేనని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. కేవలం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై ఆయన వీడియో సందేశాన్ని ఆ పార్టీ మీడియాకు విడుదల చేసింది. 

‘కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు విశాఖ ఉక్కు కర్మాగారాన్నీ తాకాయి. కేంద్ర నిర్ణయంతో పరిశ్రమపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది కానీ వ్యాపారాలు చేయదు. 1970 నుంచి లైసెన్స్‌రాజ్‌ విధానం వల్ల అనుకున్న విధంగా పరిశ్రమలు నడవక మూతపడటం, పరిశ్రమల భూములను ఎవరికి వారు అమ్ముకోవడం వల్ల కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది’అని ఆయన పేర్కొన్నారు.