కరోనాను జయించిన భారతీయులు

ప్రపంచంలో ఇంకా అనేక దేశాలు కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతుండగా ఈ ఉపద్రవాన్ని భారతీయులు జయించారని కిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్ డా. పద్మా వీరపనేని తెలిపారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ఆలోచనాపరుల వేదిక సోషల్ కాజ్ ఆధ్వర్యంలో హైటెక్ ఎక్సిబిషన్ సెంటర్ లో “మహిళా పారిశ్రామిక వేత్తలు – కరోనా సమయంలో, ఆ తర్వాత ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు” అంశంపై జరిగిన సెమినార్ కు ఆమె అధ్యక్షత వహిస్తూ మానవాళి ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ కరోనా అని చెప్పారు.

ఎక్కువగా వాట్స్ ఆప్ యూనివర్సిటీల నుండి నిరాటంకంగా వస్తున్న అనవసరమైన సమాచారం మనలను ఎక్కువ గందరగోళానికి గురిచేసినదని ఆమె చెప్పారు. అయితే ఇప్పుడు భారత్ రెండు టీకాలను కనుగొని ప్రజలకు ఇస్తూ ఉండడమే కాకుండా, ప్రపంచానికి కూడా అందిస్తున్నదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

మొదట్లో  ఈ వైరస్ గురించి కనీస అవగాహన లేదని, దానికి ఏ మందు వాడాలో కూడా తెలియదని, అంతా ప్రయోగాలు చేస్తూ వచ్చామని ఆమె గుర్తు చేశారు.  ఈ మహమ్మారి సమయంలో ప్రతి రోజు కొత్త విషయాలు నేర్చుకొంటూ వచ్చామని డా. పద్మా పేర్కొన్నారు.  ఈ మహమ్మారి కారణంగా డిజిటల్ వేదికలు, ఈ- కామర్స్ వంటి పలు నూతన అవకాశాలు ప్రజల ముంగిటకు వచ్చాయని ఆమె చెప్పారు. అత్యవసర శస్త్ర చికిత్సలకు తప్ప ఇంటినుండి వైద్యం పొందే సదుపాయం కూడా వచ్చినదని తెలిపారు.

కరోనా సమయంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పట్టణ ప్రజలకన్నా భిన్నంగా ఉన్నట్లు గౌరవ అతిధిగా పాల్గొన్న జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ సిగ్గం వెంకట రాణి చెప్పారు. నూతన సవాళ్ళను వినూత్న మార్గాలలో, సాహసంతో ఎదుర్కొనే సామర్ధ్యాన్ని ఈ మహమ్మారి కలిగించిందని ఆమె సెమినార్ లో గౌరవ అతిధిగా పాల్గొంటూ తెలిపారు.

విద్యాబోధన, విద్య ఎక్కువగా మహిళలకు స్నేహపూర్వకంగా ఉండే వృత్తులని చెబుతూ ఈ మహమ్మారి సమయంలో బడ్జెట్ పాఠశాలలు తీవ్రమైన నష్టాలకు గురయ్యాయని రిచ్మండ్ స్కూల్స్ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్ డా. సంగీత వర్మ తెలిపారు. ఒక వంక తల్లితండ్రులు, మరోవంక ప్రభుత్వం నుండి తాము విమర్శలే తప్ప `సానుభూతి’ పొందలేక పోయామని ఆమె విచారం వ్యక్తం చేశారు.

మహమ్మారి సమయంలో `ఫీజులు వసూలు చేయవద్దు’ అనే నినాదం ఉపందుకున్నదని, దానితో ఈ పాఠశాలలు సంక్షోభంలో చిక్కుకున్నదని ఆమె పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులే కాకుండా పాఠశాలలకు సేవలు అందించే బస్సుల డ్రైవర్ల  నుండి అనేక వృత్తులవారు ఉపాధి కోల్పోయారని వివరించారు.

పాఠశాలలను అటు `సేవ’గా చూడలేమని, ఇటు `వ్యాపారం’గా చూడలేమని, ఒక ఇరకాట పరిస్థితులలో ఉన్నామని డా. సంగీత చెప్పారు. దేశంలో సగం మందికి పైగా విద్యార్థులు బడ్జెట్ పాఠశాలల్లోనే చదువుతున్నారని, ఎక్కువగా మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను వీటికే పంపుతున్నారని చెబుతూ ఇవి నిలదొక్కుకునే విధంగా విధానపరమైన మద్దతు అవసరమని ఆమె స్పష్టం చేశారు.

ఒక మహిళా పారిశ్రామిక వేత్తగా ఉండడమే అనేక సమస్యలకు దారితీస్తుందని పీపుల్ క్రా సిఇఓ  సుమ రావు చెప్పారు. లైసెన్స్ పొందడం నుండి ప్రతి దశలో సమస్యలు అనివార్యమని చెబుతూ కరోనా సమయంలో తాము ఒకవిధంగా దిక్కులేని పరిస్థితులు ఎదుర్కొన్నామని ఆమె తెలిపారు. విభిన్నంగా ఆలోచిస్తే గాని మనం ఇతరుల దృష్టి ఆకట్టుకొని నిలదొక్కుకోలేమని ఈ మహమ్మారి సమయంలో గొప్ప గుణపాఠం నేర్చామని ఆమె పేర్కొన్నారు. “మీరు మార్పుకు సిద్ధమైతే అవకాశాలు ఎన్నెన్నో” అని చెప్పారు.

ఐఎఎస్ బ్రైన్స్ అకాడమీ డైరెక్టర్ డి నిహారిక రెడ్డి; షీ జాబ్స్ భారత్ అధినేత విజయ స్పందన సతియా, యువ పారిశ్రామిక వేత్తలు డా. మానస మాదాసు, దివ్య జ్యోతి, గుర్రం కవిత, త్రిప్తి అగర్వాల్ కూడా ప్రసంగించారు.