బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బెంగాల్ ఎన్నికల ముఖచిత్రం మారిపోతోంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 291 అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించగా, బిజెపిలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం ప్రధాని మోదీతో కలిసి ఓ సమావేశంలో వేదిక పంచుకోబోవడంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారనే కధనాలు వెలువడుతున్నాయి.  గత నెల 16న ఆయన ఆరెస్సెస్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్‌తో కూడా భేటీ అయ్యారు. 
 
మిథున్ చక్రవర్తి గతంలో తృణమూల్ నుంచి రాజ్యసభలో ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత శారదా చిట్‌ఫండ్ కేసులో చిక్కుకోవడంతో రాజ్యసభ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కారణంగా ఆయనన్ను ఈడీ ప్రశ్నించింది. ఈ ఘటన తర్వాతే ఆయన అనారోగ్య కారణాలను చూపుతూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన తృణమూల్ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. మరోవైపు బీజేపీ మాత్రం మిథున్ చేరికపై పరోక్షంగా సంకేతాలినిచ్చింది.
 
‘‘మమత బెనర్జీ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రముఖ వ్యక్తుల్లో మిథున్ కూడా ఒకరు. మమత గద్దె దిగాలని బెంగాలీలతో పాటు చాలా మంది ఇతర ప్రాంతాల వారూ కోరుకుంటున్నారు.’’ అని బీజేపీ ఉపాధ్యక్షుడు జయప్రకాశ్ మజుందార్ తెలిపారు. మోదీ వేదికగా మిథున్ తృణమూల్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిదాయకంగా మారింది. 
 
కాగా, సౌత్ 24 పరగణా జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై గుర్తు తెలియని దుండగులు బాంబు దాడికి దిగారు. ఈ దాడిలో ఆరుగురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బీజేపీ కార్యకర్తల బృందం శుక్రవారం అర్ధరాత్రి పెళ్లికి హాజరై తిరిగి వస్తున్నారు. ఈ సమయంలోనే ఈ దాడి జరిగింది. 
 
గాయపడిన బీజేపీ కార్యకర్తలను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అధికార తృణమూల్ పార్టీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.