బిజెపి అధికారంలోకి వస్తే కేరళలో రూ 60లకే పెట్రోల్ 

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తే కేరళలో పెట్రోల్ రూ 60
లకే అందుబాటులోకి వస్తుందని బిజెపి నాయకుడు, మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తెలిపారు. పెట్రోల్ ను జిఎస్టి పరిధిలోకి తీసుకు రావడం ద్వారా ఇది సాధ్యం కాగలదని చెబుతూ ప్రస్తుతం ఎల్డిఎఫ్ ప్రభుత్వం పెట్రోల్ ను జీఎస్టీలోకి తీసుకు రమ్మనమని ఎందుకని పోరాటం లేదని ఆయన ప్రశ్నించారు. 
 
అంతర్జాతీయ ధరలలో ఆటుపోట్ల కారణంగా పెట్రోల్ ధరలు మారుతూ వస్తున్నాయని చెబుతూ ఈ విషయమై తమ పార్టీకి స్పష్టమైన విధానం ఉన్నదని స్పష్టం చేశారు. పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావలసిన అవసరం ఉన్నప్పటికీ ఈ విషయమై కాంగ్రెస్, వామపక్షులకు ఎందుకని తమ వైఖరులను స్పష్టం చేయడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. 
 
ఇంధనం ధరలను సమంజస స్థాయికి తీసుకు రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఒక మార్గం కనుగొనాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారని రాజశేఖరన్ గుర్తు చేశారు. పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడమే సమాధానం కాగలదని కూడా ఆమె సూచించారని ఆయన పేర్కొన్నారు. 

పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడం ఆచరణయోగ్యం కాదని కేరళ ఆర్ధిక మంత్రి థామస్ ఐజాక్ ఎందుకు అనుకొంటున్నారని ఆయన ప్రశ్నించారు.  కేరళలో బిజెపి అధికారంలోకి వస్తే పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా ధరను లీటర్ రూ 60కు తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు.