టీఆర్‌ఎస్ ‌ప్రచారానికి లాడెన్‌, దావూద్‌ ఫోటోలు బెస్ట్!

టీఆర్‌ఎస్‌ నాయకులు పీవీ లాంటి గొప్ప నేత ఫొటో కాకుండా ఒసామా బిన్‌ లాడెన్‌, దావూద్‌ ఇబ్రహీం వంటి వారి ఫొటో లు పెట్టుకుంటే ప్రజలు గుర్తిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అలాంటి వారే టీఆర్‌ఎస్‌ ప్రచారానికి సరైన వారని ఎద్దేవా చేశారు. 

బుధవారం రాత్రి కేపీహెచ్‌బీకి చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు బీజేపీలో చేరిన సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ  పీవీ ఫొటోతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసుకుంటుందంటే కాంగ్రెస్‌ నేతలు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే అని దయ్యబట్టారు.

ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ కాగ్‌ నివేదిక ఇచ్చిన మాట వాస్తవమా? కాదా? మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

సీఎం పీఆర్వో విజయ్‌ కుమార్‌ను తొలగించిన అంశంపై  ఒక విలేకరి సంజ య్‌ దృష్టికి తీసుకెళ్లగా సీఎం కేసీఆరే అవినీతిపరుడని ఆరోపించారు. ‘‘సమస్యలు పరిష్కరించాలని ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థించడం ఉండదు.. ఇక నుంచి అన్నీ వార్నింగ్‌లే’’ అని సంజయ్‌ హెచ్చరించారు

 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జీహెచ్‌ఎంసీ పార్టీ కార్పొరేటర్‌లతో జరిగిన సమావేశంలో ఆయన  మాట్లాడుతూ లక్షల కోట్లు దోచుకున్నందుకు కేసీఆర్‌కు జైలు జీవితం తప్పదని, ఆయన పతనం ఆరంభమైందని స్పష్టం చేశారు.