
అరవై ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రెండో దశ వ్యాక్సినేషన్ సోమవారం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి డోసు టీకాను తీసుకోవడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని తొలి టీకా వేసుకుని అందరికీ ఒక ఉదాహరణగా నిలిచారని ప్రశంసించారు.
‘మనం సొంతంగా తయారు చేసిన రెండు వ్యాక్సిన్లు సురక్షితమని మొదట్నించీ నేను చెబుతున్నాను. ఇమ్యునోజెనిసిటీ పరంగా చాలా కచ్చితంగా పనిచేస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం’ అని చెప్పారు.
అందరికీ మనం ఒక ఉదాహరణగా నిలవాలని ప్రధాని పదేపదే చెబుతుంటారు. 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకాగానే తొలి టీకా ఆయనే వేయించుకున్నారని హర్షవర్దన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, విపక్షాల ఎమ్మెల్యేలు సైతం వ్యాక్సినేషన్ తీసుకోవాలని, తద్వారా ప్రజలకు కూడా సాధ్యమైనంత త్వరగా వాక్సినేషన్ తీసుకోవాలనే సందేశం పంపాలని కోరారు.
కాగా, ప్రధాని మోదీ తొలి టీకా తీసుకోవడం ద్వారా మనం కూడా మన సమయం వచ్చినప్పుడు టీకా తీసుకోవాలని సందేశం ఇచ్చారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా పేర్కొన్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని సూచించారు. కోవిడ్ నుంచి సురక్షితంగా బయటపడాలంటే ఇదొక్కటే మార్గమని స్పష్టం చేశారు.
మరోవంక,ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రంలో వెంకయ్య ఈ రోజు ఉదయం వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటోలను వెంకయ్య తన ట్విటర్‌లో షేర్ చేశారు.
వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులంతా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. పేద, ధనిక అనే తేడా లేకుండా వ్యాక్సిన్ సరఫరాకు మన దేశం ముందుకు రావడం హర్షించదగిన విషయమని ఆయన చెప్పారు. రెండో డోసును 28 రోజుల తర్వాత తీసుకోవాల్సి ఉంటుందని వెంకయ్య వెల్లడించారు.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే