నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కమలందే అని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.
బుధవారం ఆ పార్టీ స్టేట్ ఆఫీసులో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేషంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ ‘‘సాగర్ ఉప ఎన్నికకు వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి నుంచి బీజేపీ రాష్ట్ర పదాధికారులంతా అక్కడే మకాం వేసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయాలి” అని దిశానిర్దేశం చేశారు.
సాగర్ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు ముడిపడిఉందని, అక్కడ మనం గెలిస్తే ఆర్ఎస్ పని ఖతమైపోయినట్లేనని చెప్పారు. సాగర్ లో బీజేపీ అభ్యర్థి ఎవరనేది అందరి ఆమోదం మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోదీ తరహా పాలనను కోరుకుంటున్నారని ఆయన భరోసా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ మాటలకు, టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే కావాలని తరుణ్ చుగ్ పిలుపిచ్చారు. ఎన్నికల ప్రచారానికి పార్టీ జాతీయ నేతలు వస్తారని చెప్పారు. జిల్లా స్థాయిలో జాతీయ నేతలు, నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర నేతలు, మండల స్థాయిలో జిల్లా నేతలు ప్రచారం చేస్తారని చెప్పారు.
ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, నిరుద్యోగులు టీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకతను చూపుతున్నందున, దీన్ని అవకాశంగా మలచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మురళీధర్ రావు, ఎంపీ డి అర్వింద్, మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, డీకే అరుణ, రాంచంద్రరావు, రాజాసింగ్, రఘునందన్ రావు, మంత్రి శ్రీనివాస్, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జిలు పాల్గొన్నారు.
ఈ నెల 28 వరకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ల వివరాలు సేకరించి, నిరుద్యోగ భృతికి ఎంతమంది అర్హులు ఉన్నారనే వివరాలు బయటపెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఈ నెల 26, 27 తేదీల్లో జిల్లా పార్టీ పదాధికారుల సమావేశాలు, వచ్చే నెల 1 నుంచి 3 వరకు మండల పార్టీ పదాధికారుల సమావేశాలు, వచ్చే నెల 4 నుంచి 10 వరకు అనుబంధ మోర్చాల రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు.
కాగా, తరుణ్ చుగ్ ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హాలియాలో కార్యకర్తలు, నేతలతో తరుణ్‌చుగ్ సమావేశంకానున్నారు. ఉపఎన్నికల్లో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. తరుణ్ చుగ్ సమక్షంలో వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరనున్నారు.
More Stories
ఫిరాయింపులపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
కోల్‌కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్‌తో ప్లాన్… ఐఎస్ కుట్ర!