టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు
టీఆర్ఎస్ పార్టీ తరపున గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డిపై నల్లగొండ జిల్లా పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి. 
 
పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం జిల్లా కలెక్టర్‌కు నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కలిసి అభిమానులతో ర్యాలీగా వచ్చి ఆయన నామినేషన్ వేశారు. 
 
అయితే నామినేషన్ సందర్భంగా నల్లగొండ పట్టణంలో రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. అదేవిధంగా ర్యాలీలో డీజేలను కూడా ఉపయోగించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, డీజేలు పెట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. దాంతో జిల్లా పోలీసులు ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు.
 
కాగా, రాష్ట్రంలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎం ఎల్‌సి స్థానాల ఎన్నికలకు ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులను(జనరల్ అబ్జర్వర్లు) నియమించింది. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ స్థానానికి ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి అడిషనల్ డైరెక్టర్ హరిప్రీత్‌సింగ్‌ను, వరంగల్ – ఖమ్మం – నల్గొండ స్థానానికి యువజన విభా గం ముఖ్యకార్యదర్శి సబ్యసాచి గోష్‌పు నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు.