లెఫ్టెనెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై వేటు

పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై వేటు పడింది. ఆమెను లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా పుదుచ్చేరి అదనపు బాధ్యతలను తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు అప్పగించారు. కిరణ్ బేడీని తప్పించడం వెనుక కారణం ఏంటనే విషయాలు ఇంకా తెలిసి రాలేదు. 
 
మరికొద్ది రోజుల్లో నాలుగు రాష్ట్రాలతో కలిపి పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పైగా అక్కడ కాంగ్రెస్ నేత నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిన రోజుననే ఆమె బదిలీ జరగడం ఆసక్తి కలిగిస్తున్నది.  2016లో ఎల్జీగా నియమితులైనప్పటి నుంచి కిరణ్‌బేడీకి, ప్రభుత్వానికి మధ్య వివిధ అంశాల్లో విభేదాలు నెలకొన్నాయి.   ఆమెను వెంటనే రీకాల్ చేయాలనీ కోరుతూ వారం రోజుల క్రితమే ముఖ్యమంత్రి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు లేఖ వ్రాసారు.
 
పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ సర్కారు సంక్షోభంలో చిక్కుకున్నది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జాన్‌కుమార్‌ మంగళవారం రాజీనామా చేయటంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో సీఎం రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీలో 33 స్థానాలు ఉన్నాయి. ఇందులో మూడు నామినేటెడ్‌ సీట్లు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 10 మంది సభ్యులు ఉండగా, ముగ్గురు డీఎంకే సభ్యులు, ఒక స్వతంత్ర సభ్యుడు ఆ పార్టీకి మద్దతిస్తున్నారు. ప్రతిపక్షానికి 14 మంది సభ్యులున్నారు.
 
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ‘‘జీవితకాల అనుభవం’’ ఇచ్చినందుకు కిరణ్ బేడి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.‘‘పుదుచ్చేరి ప్రజలకు, ప్రభుత్వ అధికారులందరికీ  లెఫ్టినెంట్ గవర్నర్‌గా నా ప్రయాణంలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు’’ అని 71 ఏళ్ల కిరణ్ బేడి బుధవారం ఉదయం ఒక ప్రకటనతో పాటు ట్వీట్ చేశారు.పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేసిన జీవితకాల అనుభవానికి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని ఆమె పేర్కొన్నారు.
కాగా, ఎల్జీ ప‌ద‌వి నుంచి కిర‌ణ్‌బేడీని తొల‌గించ‌డాన్ని సీఎం నారాయ‌ణ‌స్వామి స్వాగ‌తించారు.  ఇది ప్ర‌జ‌ల విజ‌యం అంటూ ఆయ‌న పేర్కొన్నారు.