ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా 4 ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు 

బ‌్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా కేంద్రం ఒక అడుగు ముందుకేసింది. రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్రైవేటీక‌రిస్తామ‌ని ఆర్ధిక  మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈ నెల 1న పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించిన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్ర‌యం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు కేంద్రం ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది.

 అందుకు గానూ నాలుగు మధ్య తరహా ప్రభుత్వ బ్యాంకుల జాబితాను సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. ప్రైవేటీక‌ర‌ణ దిశ‌గా నాలుగు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల జాబితాను ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం.

ఆ జాబితాలో బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్‌, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయ‌ని తెలియ‌వ‌చ్చింది. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు వంటి బ్యాంకుల‌నూ ప్రైవేటీక‌రించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ త‌ల‌పోస్తున్న‌ట్లు వినికిడి.

అయితే వీటిలో రెండు బ్యాంకులను ఎంపిక చేసి 2021/22 ఆర్థిక సంవత్సరానికి ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ నుండి మొదలుకావచ్చునని భావిస్తున్నారు. ఇంకా ఈ రెండు బ్యాంకులేమిటన్నదీ తెలియరాలేదు.అయితే..ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం ఐదు లేదా ఆరు నెలల పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. 

గ్రామీణ ప్రాంతంలో రుణ ప‌ర‌ప‌తి సేవ‌ల‌ను విస్త‌రించ‌డానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను స్ట్రాట‌ర్జిక్ బ్యాంకుగా కేంద్రం కొన‌సాగించ‌నున్న‌ద‌ని తెలుస్తున్నది. అందుకోసం ఎస్బీఐలో మెజారిటీ వాటాను కేంద్రం కొన‌సాగించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. క‌‌నుక ఇప్ప‌టికిప్పుడు ఎస్బీఐ వంటి పెద్ద బ్యాంకుల‌కు వ‌చ్చిన ముప్పేమీ లేదని,  మొండి బ‌కాయిలు ఎక్కువ‌గా ఉన్న బ్యాంకుల‌కు ప్రైవేటీక‌ర‌ణ ముప్పు పొంచి ఉండవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.