అజిత్ ధోవల్  ఇంటి వద్ద ఉగ్రవాది రెక్కీ

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌  ధోవల్‌  ‌ను పాకిస్థాన్‌ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ఢిల్లీలోని డోభాల్‌ నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు ఈనెల 6న అరెస్టయిన జైషే మొహమ్మద్‌ ఉగ్రవాది హిదయత్‌ ఉల్లా మాలిక్‌ పోలీసుల విచారణలో తెలిపాడు. 
 
ఈ నేపథ్యంలో డోభాల్‌ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను భారీగా పెం చారు. ఢిల్లీలో రెక్కీ నిర్వహించిన తర్వాత పాకిస్థాన్‌లోని తన సూత్రధారులకు ఆ కీలక సమాచారాన్ని కూడా చేరవేశాడు. పాకిస్థాన్‌లోని తమ నాయకుడి సూచన మేరకు ఢిల్లీలోని ఎన్‌ఎస్‌ఏ కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించానని ఒప్పుకున్నాడు. 
 
2019 మే 24న శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి మాలిక్‌ విమానంలో వచ్చాడు. తర్వాతి రోజు (మే 25) ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో వీడియోలు తీశాడు. ఆ ప్రాంతంలో డోభాల్‌ నివాసం కూడా ఉంది. రెక్కీలు నిర్వహించడంతో పాటు దాడులకు ప్రణాళికలు రచించడం, ముష్కరులను తీసుకొని లక్షిత ప్రాంతాల్లో వదిలేయడం వంటి చర్యలకు మాలిక్‌ పాల్పడ్డాడు.
 
తాను టచ్‌లో ఉన్న 8 మంది ఉగ్రవాదుల పేర్లను కూడా వెల్లడించాడ అని అధికారులు తెలిపారు. కాగా, నిరుడు దక్షిణ కశ్మీర్‌లోని ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఓ పోలీసును హత్యచేసిన ఘటనలో ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’(టీఆర్‌ఎఫ్‌)తో సంబంధం ఉన్న ఉగ్రవాది జహూర్‌ అహ్మద్‌ రాథర్‌ను కశ్మీర్‌లో అరెస్టు చేశారు.