 
                దేశ సేవలో సైనికుల త్యాగాలు మరువలేనివని పేర్కొంటూ మన మాతృభూమిని కాపాడంలో తమకు సాటి లేదని అంటూ పదే పదే  వారు నిరూపిస్తూ వస్తున్నారని  ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత ఆర్మీ దేశానికి ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. కష్టకాలంలో సైనికులు చూపిన ధైర్య సాహాసాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని ప్రధాని తెలిపారు. 
చెన్నయ్ లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అర్జున్ ఎంకే-1ఎ యుద్ధట్యాంకును మోదీ ఆర్మీకి అప్పగించారు. ఈ యుద్ధ ట్యాంకును ఆర్మీకి అప్పగించడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు. 
డీఆర్డీవో చీఫ్ సతీశ్‌రెడ్డి అర్జున్ యుద్ధట్యాంకు నమూనాను ప్రధానికి అందించగా.. ప్రధాని తన చేతుల మీదుగా దాన్ని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణెకు అందజేశారు. అవడిలోని హెవీ వెహికిల్ ఫ్యాక్టరీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో ఈ అర్జున్ ఎంకే-1ఎ యుద్ధట్యాంకులను అభివృద్ధి చేస్తున్నది. 
ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో భారత రక్షణశాఖ మొత్తం 118 అర్జున్ ఎంకే-1ఎ యుద్ధ ట్యాంకులను ఆర్మీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. వాటి తయారీ కోసం మొత్తం రూ.8,400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 14వ తేదీని దేశ ప్రజలు మరిచిపోరని ఆయన చెప్పారు. రెండేళ్ల క్రితం ఇదే రోజు ముష్కరులు 40 మంది భారత సైనికులను పొట్టనబెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న రెండు రక్షణ కారిడార్లలో ఒకటి తమిళనాడులో ఉందని, ఇది ఇప్పటికే  రూ.8,100 కోట్ల పెట్టుబడి ఒప్పందం పొందిందని ప్రధాని పేర్కొన్నారు.
అనంతరం తమిళనాడు రైతులపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. తమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో పంటలను ఉత్పత్తి చేస్తున్నారని కొనియాడారు. చెన్నై నగరం నాలెడ్జ్‌కు, క్రియేటివిటీకి సింబల్ అని పేర్కొన్నారు.  తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆయన తేల్చిచెప్పారు.
జల వనరులను సమర్థంగా వినియోగించుకుని ఇక్కడి రైతులు భారీ దిగుబడులను రాబట్టారని చెన్నైలో  ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ అన్నదాతలను ప్రశంసించారు. నీటిని సంరక్షించేందుకు మనం శక్తివంచన లేకుండా పనిచేయాలని, ప్రతి నీటి చుక్కనూ మరింత దిగుబడికి అనువుగా మలుచుకోవాలనే నినాదంతో ముందుకెళ్లాలని కోరారు.
చెన్నై మెట్రో రైల్ విస్తరణతో పాటు మెట్రో రైల్ మలిదశలో 9 కిలోమీటర్ల లైన్‌ను ప్రారంభించుకోవడం సంతోషకరమని ప్రధాని చెప్పారు. కొవిడ్-19 మహమ్మారి వెంటాడినా అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్టును అధికారులు, కాంట్రాక్టర్లు పూర్తిచేశారని కొనియాడారు. చెన్నై మెట్రో వేగంగా విస్తరిస్తోందని, ఈ ఏడాది బడ్జెట్లో మెట్రో రెండో దశకు రూ 63,000 కోట్లు కేటాయించామని చెప్పారు. ఏ నగరంలోని ప్రాజెక్టుకైనా ఈ స్ధాయిలో భారీ నిధులు కేటాయించడం ఇదే తొలిసారని చెప్పారు.
                            
                        
	                    




More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
యమునా నదిని పరిశుభ్రం చేయడం అసాధ్యం కాదు!