టీఆరెఎస్ ఇక ఓట్లు అడగకూడదు

 
మాట నిలబెట్టుకోకుంటే ఓట్లు అడగం… మాట తప్పితే మెడ నరుక్కుంటా… అన్నవన్నీ నిజమే అయితే, టీఆరెఎస్ ఇప్పటికే ఓట్లు అడగకూడదని బిజెపి నేత విజయశాంతి స్పష్టం చేశారు.  
 
నల్గొండ జిల్లా హాలియాలో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ ఆమె సోషల్ మీడియా‌లో పోస్ట్ లో ‘ముఖ్యమంత్రిగారు మరోమారు ఎన్నికల ప్రసంగాలు మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీ తర్వాత ప్రజలను ఇప్పుడు మరోసారి కలవక తప్పదని, ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల దృష్ట్యా అనుకున్నట్టుంది’ అంటూ ఎద్దేవా చేశారు.
 ఇక కుర్చీ వేసుకుని స్వయంగా కేసీఆర్ గారు చేస్తానన్న అభివృద్ధి ఎంత ఘనంగా ఉంటదో పక్కనున్న వరంగల్ జిల్లా ప్రజలకు, మిగతా తెలంగాణకు బాగా తెలుసని ఆమె ధ్వజమెత్తారు. మరోసారి ఆ మాటలకు ఇంకెవరూ మోసపోవడానికి సిద్ధంగా లేరని ఆమె స్పష్టం చేసారు.  హాలియా సభకు హాజరైన ప్రజలు సీఎం గారి ప్రసంగానికి స్పందించక పోవటాన్ని చూస్తేనే అర్థం అవుతోందని ఆమె పేర్కొన్నారు.

‘ఓటములతో ఫ్రస్ట్రేషన్ ఎక్కువయి… తెలంగాణ ప్రజలను కుక్కలని… వేదన చెప్పుకోవడానికి వచ్చినవాళ్ళను ఈడ్చుకుపోవాలని… మేం తల్చుకుంటే నాశనమైపోతారని స్వయంగా సీఎం గూండా గిరికి తెగబడుతుంటే ఆ దొరహంకారానికి కర్రుకాల్చి ఓటు ద్వారా వాత పెట్టాల్సిన జిమ్మేదారీని ప్రజలు తీసుకోక తప్పదు’ అంటూ ఆమె హెచ్చరించారు. 

బాధిత మహిళలు కుక్కలా? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను కుక్కలన్నందుకు యావత్ మహిళా సమాజానికి ఈ ముఖ్యమంత్రి గారు క్షపమాణ చెప్పి తీరాలని విజయశాంతి డిమాండ్ చేశారు.