నితీష్ మంత్రివర్గంలో స‌హ‌న‌వాజ్ హుస్సేన్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ త‌న మంత్రివర్గాన్ని  విస్త‌రించారు. ఇవాళ 17 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.  తొలుత మాజీ కేంద్ర మంత్రి, బిజెపి నేత  స‌హ‌న‌వాజ్ హుస్సేన్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.  గ‌వ‌ర్న‌ర్ ఫాగూ చౌహాన్ ఆయ‌న చేత ప్ర‌మాణం చేయించారు.  రాజ్‌భ‌వ‌న్‌లో ఈ వేడుక జ‌రిగింది. గ‌త నెల‌లో మండ‌లికి హుస్సేన్ ఎన్నిక‌య్యారు.  

ప్ర‌మాణ స్వీకారం చేసిన వారిలో జేడీయూ నేత‌లు సంజ‌య్ కుమార్ జా, శ్రావ‌ణ్ కుమార్‌, లేసి సింగ్‌, బీజేపీకి చెందిన మ‌ద‌న్ సాహ‌ని, ప్ర‌మోద్ కుమార్‌లు ఉన్నారు. బీహార్ అసెంబ్లీలో 36 మందితో మంత్రివర్గంను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు నితీశ్ బృందంలో 13 మంది మాత్ర‌మే అక్క‌డ మంత్రులుగా ఉన్నారు.   

గ‌తేడాది మ‌ర‌ణించిన బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ క‌జిన్ నీర‌జ్ సింగ్ బ‌బ్లూకు కూడా మంత్రివర్గంలో స్థానం లభించింది.  బీజేపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన నీర‌జ్ సింగ్ బ‌బ్లూ.. రాజ్‌పూత‌న ట‌ర్బ‌న్ ధ‌రించి ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌ర‌య్యారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకోలేద‌ని తొలుత ప్ర‌క‌టించిన వ్య‌క్తి నీర‌జ్ సింగ్ బబ్లూయే.

అంతే కాదు.. సోష‌ల్ మీడియాలో జ‌స్టిస్ ఫ‌ర్ ఎస్ఎస్ఆర్ అనే ప్ర‌చారోద్య‌మాన్ని కూడా ఆయ‌నే ప్రారంభించారు. గ‌తేడాది జూన్‌లో సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న కుటుంబంలో జ‌రిగిన ప్ర‌తి కార్య‌క్ర‌మంలోనూ నీర‌జ్ సింగ్ బ‌బ్లూ ఉన్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.